విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధం ఆపాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధం ఆపాలి

Aug 20 2026 3:28 AM | Updated on Aug 20 2026 3:28 AM

● ఎస్‌ఎఫ్‌ఐ – డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష ● దీక్షకు మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ● ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి ● ‘చలపతి’లో ఘనంగా ప్రథమ ఏడాది తరగతులు ప్రారంభోత్సవం

లక్ష్మీపురం: విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధం ఆపాలని, విద్యా కార్పొరేటీకరణ, కేంద్రీకరణ వైపు తీసుకువెళ్లే నూతన విద్యావిధానాన్ని, ఎన్‌.టి.ఎను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ విధ్యార్థి సంఘాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన దీక్షను బుధవారం నిర్వహించారు. ముందుగా విద్యార్థి సంఘం నాయకులకు పూల దండలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ.. విద్య గతంలో ఉమ్మడి జాబితాలో ఉండేదని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని కేంద్రీకరణ చేసి కేంద్రం చేతుల్లోకి తీసుకుని నూతన విద్యావిధానం ఎన్‌ఈపీని తీసుకువచ్చిందన్నారు. ఈ నేపధ్యంలోనే గతంలో రాష్ట్రాల వారీగా జరిగే ఎంసెట్‌ పరీక్షను కేంద్రమే నిర్వహిస్తూ ఎన్‌టీఏను ఏర్పాటు చేసిందన్నారు. ఈ సంస్థ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారి గొంతు నొక్కేందుకు నిర్బంధాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. డి.వై.ఎఫ్‌.ఐ గుంటూరు జిల్లా కన్వీనర్‌ వై.కృష్ణకాంత్‌, ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు జిల్లా కన్వీనర్‌ షేక్‌ సమీర్‌లు మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు రాజ్‌ కుమార్‌, కిరణ్‌ దాసరి,దుర్గాప్రసాద్‌ నాయక్‌ , మరియమ్మ, మనీ, యశ్వంత్‌, సాయి, జావిద్‌, యుగేందర్‌, శ్యామ్‌, చరణ్‌, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.

రాబోయే రోజుల్లో చలపతి వర్సిటీలో ఆధునిక వసతులు

తాడికొండ: చలపతి యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని ఏపీ స్టేట్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. చలపతి యూనివర్సిటీలో మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక వసతులతో కూడిన విద్యనందిస్తూ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటం కంప్యూటింగ్‌ ప్రాధాన్యం, పారిశ్రామిక అనుబంధ కరిక్యులమ్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. 18 సంవత్సరాలకు యూనివర్సిటీగా అవతరించడం అభినందనీయమన్నారు. ఏఎన్‌యు రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.శివరాం ప్రసాద్‌ మాట్లాడుతూ ఆశలు, ఆకాంక్షలతో పిల్లల భవిష్యత్‌ ఉన్నతంగా ఉండాలంటే చలపతిలో ప్రవేశం మంచి నిర్ణయం అన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. చలపతి చాన్స్‌లర్‌ డాక్టర్‌ వైవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఆశలు, ఆశయాలు, సదుద్దేశంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ వర్సిటీని ఎంచుకున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రొ.ఛాన్స్‌లర్‌ వై.సుజిత్‌ కుమార్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ నాదెండ్ల రామారావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.నాగ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అసెంబ్లీ భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఐజీ

తాడికొండ: ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీలు, వీఐపీల భద్రతతో పాటు శాసనసభ పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గుంటూరు జిల్లా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాసనసభ పరిసర ప్రాంతాలను 3వ రోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. అసెంబ్లీకి వచ్చే ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, వాహన తనిఖీ కేంద్రాలు, ప్రవేశ ద్వారాలు, వీవీఐపీ/వీఐపీ మార్గాలు, పార్కింగ్‌ ప్రాంతాలను పరిశీలించారు. ప్రతి వ్యక్తి, వాహనాన్ని నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాల కదలికలను గుర్తించిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఐజీ వెంట తుళ్లూరు సీఐ కె.శ్రీనివాసరావు, పలువురు సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement