ఏడో రోజుకు చేరిన జూనియర్ వైద్యుల సమ్మె
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె ఆదివారానికి ఏడో రోజుకు చేరుకుంది. జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఆరు రోజులుగా ఓపీ, ఐపీ సేవలను నిలిపివేసి, నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేస్తూ విధులు బహిష్కరించిన జూడాలు సమ్మెను తీవ్రం చేసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు. గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలలో హౌస్ సర్జన్లు 250 మంది, పీజీ వైద్యులు 160 మంది, సర్వీస్ పీజీ వైద్యులు 60 మంది ఉన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినా, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని జూడాలు వాపోయారు.
ప్రభుత్వం స్పందించాలి..
రోగులు తమ సమస్యలను అర్థం చేసుకోవాలని కోరారు. ఇకనైనా టీడీపీ ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యు. ఈశ్వర్‌ప్రసాద్, జిల్లా సెక్రటరీలు విఘ్నేష్ ఆపతి, పీఎస్‌వీ కల్యాణి, గాదె జగదీష్, జాయింట్ సెక్రటరీలు బి. వంశీకృష్ణ, స్నేహ సాహిత్య, జి. రాధిక, కునపవర్ కార్తిక్, సందీప్, కీర్తి తదితరులు పాల్గొన్నారు.


