గుంటూరు ఎడ్యుకేషన్: ఏసీ కళాశాల ఎదుట ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని పునర్నిర్మించేందుకు ఆదివారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్(సీసీఎల్) చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ అందిస్తున్న రూ.20 కోట్ల ఆర్థిక సహకారంతో నూతనంగా నిర్మించనున్న జీ ప్లస్‌టూ గ్రంథాలయ భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఆదివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. 1915లో బ్రిటీషు పాలనలో నిర్మించిన ప్రాంతీయ గ్రంథాలయం 110 ఏళ్లకు పైబడి ఇదే భవనంలో కొనసాగుతోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 1,100 కాఫీ బ్రాండ్లను పరిచయం చేసిన చల్లా రాజేంద్రప్రసాద్ సహకారంతో గ్రంథాలయానికి నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయించామన్నారు. భవన నిర్మాణం పూర్తయ్యేలోపు ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ పాల్గొన్నారు.
రూ.20 కోట్లు సమకూర్చిన
దాత చల్లా రాజేంద్రప్రసాద్


