నగరంపాలెం(గుంటూరు వెస్ట్): మహిళలు, సామాన్య ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలికామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. శనివారం నగరంపాలెం పోలీస్ కల్యాణ మండపంలో అభయ్ ఆటో గుంటూరు డిజిటల్ యాప్, ఆటోలకు కేటాయించిన డిజిటల్ క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఆటోల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్‌నెస్ పరిశీలించాక ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తామన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ఆటో ముందు, వెనుక, లోపల ప్రయాణికులకు కనిపించేలా అతికిస్తారని చెప్పారు. ప్రయాణికులు మొబైల్‌ఫోన్లల్లో ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్, యజమాని వివరాలు, ఆటో/ మొబైల్ నంబర్లు, చిరునామా ప్రత్యక్షమవుతాయన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అలహరి శ్రీనివాసరావు (ఎస్‌బీ), సీఐలు ఎ.అశోక్ (తూర్పు ట్రాఫిక్ పీఎస్), సింగయ్య (పశ్చిమ ట్రాఫిక్ పీఎస్), నిషార్‌బాషా (ఐటీ కోర్), యాప్ రూపకల్పనకు సహకరించిన పెంచలరెడ్డి శేఖర్, కమ్యూనికేషన్స్ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.


