బాపట్ల టౌన్: వ్యవసాయాభివృద్ధికి శాసీ్త్రయ పరిశోధనలు అవసరమని, సహజ సాగు పద్ధతులు భవిష్యత్‌కు మార్గమని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో శనివారం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన గవర్నర్, పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను అధిగమించేందుకు శాసీ్త్రయ పరిశోధనలు, సుస్థిర వ్యవసాయ విధానాలు, సహజ సాగు విధానాలు అత్యంత అవసరమన్నారు. ఆరు దశాబ్దాలుగా వర్సిటీ వ్యవసాయ విద్య, పరిశోధనలు, విస్తరణ సేవల ద్వారా రైతులకు, సాగులో ప్రగతికి విశేష సేవలు అందిస్తోందన్నారు. ఈ స్నాతకోత్సవం విద్యార్థుల కృషి, పట్టుదల, అంకితభావానికి నిదర్శనమని చెప్పారు. వారి విజయాల్లో తల్లిదండ్రులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తల పాత్ర అమూల్యమన్నారు. ప్రధాన అతిథిగా విచ్చేసిన ఐసీఏఆర్–ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, పూర్వ విద్యార్థి డాశ్రీశ్రీ శ్రీనివాసరావును గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. సహజ వనరుల నిర్వహణ, సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయ విధానాల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి దేశానికి మార్గదర్శకమన్నారు. పత్తి సాగు అభివృద్ధికి విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన పత్తి శాస్త్రవేత్త కె. రవీంద్రనాథ్‌కు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (హానోరిస్ కాజా) ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. వ్యవసాయం కేవలం ఆర్థిక కార్యకలాపం మాత్రమే కాదన్నారు. దేశ సంస్కృతి, ఆహార భద్రత, సమాజ శ్రేయస్సుకు పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని, వారి అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. 50 మందికి డాక్టరేట్, 240 మంది పీజీ విద్యార్థులు, 1385 మంది గ్రాడ్యుయేట్లతోపాటు పలువురికి పతకాలు, ప్రతిభ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఐసీఏఆర్ భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సంచాలకులు డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పి.వి. సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న రాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్


