గుంటూరు వైద్యురాలి ఘనవిజయం | - | Sakshi
Sakshi News home page

గుంటూరు వైద్యురాలి ఘనవిజయం

Jul 17 2026 3:28 AM | Updated on Jul 17 2026 3:28 AM

డాక్టర్‌ పమిడిముక్కల విజయకు అంతర్జాతీయ గుర్తింపు వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌గా నియామకం దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటి వైద్యురాలిగా స్థానం

తండ్రిపేరుతో సేవా కార్యక్రమాలు

గుంటూరు మెడికల్‌: గుంటూరుకు చెందిన సీనియర్‌ న్యూరాలజిస్ట్‌, లలితా పీవీఎస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పమిడిముక్కల విజయ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 18 మంది వైద్యులను మాత్రమే ఎంపిక చేసే వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌కు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా ఎంపికై రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌కు ఎంపికై న మొట్టమొదటి వ్యక్తిగా డాక్టర్‌ విజయ రికార్డు సృష్టించారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ బాధితులకు అందిస్తున్న చికిత్సలకు, పక్షవాత బారిన పడకుండా ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలకు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ చికిత్సల్లో వైద్యులు, సిబ్బందికి లలితా పీవీఎస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన అంకినీడు స్ట్రోక్‌ సెంటర్‌ ద్వారా అందిస్తున్న అత్యుతన్నత వైద్య ప్రమాణాలకు అంతర్జాతీయ గౌరవం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఇండియన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షురాలిగా ఆమె పనిచేసి రికార్డు సృష్టించారు.

1996 నుంచి సేవలు

ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా 1996లో గుంటూరులో అంకినీడు స్ట్రోక్‌ సెంటర్‌ను డాక్టర్‌ విజయ ఏర్పాటు చేశారు. పక్షవాత ( బ్రెయిన్‌ స్ట్రోక్‌) చికిత్సలో అత్యున్నత ప్రమాణాలు, నాణ్యమైన వైద్యసేవలు అందించటంలో అంకినీడు స్ట్రోక్‌ సెంటర్‌ చూపుతున్న నిరంతర కృషికి గాను ఇటీవల జాతీయ అవార్డు లభించింది. వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ ఏజెంల్స్‌ ఇనిస్టిట్యూట్‌ డైమండ్‌ స్టేటస్‌ అంతర్జాతీయ అవార్డు స్ట్రోక్‌ సెంటర్‌కు, డాక్టర్‌ విజయకు 2020 నుంచి 2025 వరకు వరుసగా ఐదుసార్లు లభించింది.

తాత మరణం కలచివేసింది..

ఈ సందర్భంగా డాక్టర్‌ పి.విజయ ‘సాక్షి’తో మాట్లాడుతూ నేను ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో తాత అంకినీడుకు పక్షవాతం వచ్చి సకాలంలో చికిత్స ఎక్కడా లభించక చనిపోయారని, కళ్లెదుటే ఆయన మరణం చూసి తట్టుకోలేక బ్రెయిన్‌ స్ట్రోక్‌ మరణాలు నివారించాలని మనస్సులో గట్టిగా నిర్ణయించుకున్నానని తెలిపారు. తదనుగుణంగా న్యూరాలజిస్ట్‌గా సేవలు ప్రారంభించానని తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా మా తాత అంకినీడు పేరు మీదుగా 1996లో గుంటూరులో పక్షవాత మరణాలు నివారణే లక్ష్యంగా స్ట్రోక్‌ యూనిట్‌ ఏర్పాటు చేశామన్నారు.

అంకినీడు స్ట్రోక్‌ సెంటర్‌ డైరక్టర్‌గా ఉన్న తాను ప్రతినెలా 100 నుంచి 125 మంది స్ట్రోక్‌ బాధితులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వరల్డ్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌కు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా ఎంపికవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి స్ట్రోక్‌ మరణాలు తగ్గింపే లక్ష్యంగా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ఇచ్చిన పదవికి దేశానికి గుర్తింపు వచ్చేలా పనిచేస్తానని తెలిపారు.

డాక్టర్‌ విజయ తన తండ్రి పమిడిముక్కల కుటుంబారావు పేరుతో 2006లో చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందజేస్తున్నారు. వేలాది ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు సేవలందిస్తున్నారు. వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అనేక సంస్థల్లో, గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement