కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఫ్యాక్టరీల శాఖ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జీటీ రోడ్‌లోని టుబాకో అసోసియేషన్ హాల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు 81 ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డెప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్‌లలో వినియోగించే అమ్మోనియా గ్యాస్ అత్యంత ప్రమాదకరమైనదని, అందువల్ల భద్రతా ప్రమాణాలను ఏ మాత్రం విస్మరించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా కంప్రెసర్ గదుల్లో ఉన్న అమ్మోనియా నిల్వ ట్యాంకులను బయట ఏర్పాటు చేయడం ద్వారా భారీ ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని తెలిపారు. గ్యాస్ లీకేజీలు, పేలుళ్లు వంటి ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జీరో ప్రమాద మరణాలే లక్ష్యం..
కోల్డ్ స్టోరేజ్‌ల అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్రబాబు మాట్లాడుతూ శివకుమార్ రెడ్డి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, శిక్షణల వల్లే పరిశ్రమల యాజమాన్యాల్లో భద్రతపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని చెప్పారు. ఈ చైతన్యమే అమ్మోనియా ట్యాంకుల స్థాన మార్పుతో పాటు భద్రతా ప్రమాణాల అమలుకు దోహదపడిందన్నారు. సదస్సులో కోల్డ్ స్టోరేజ్ అసోసియేషన్ కార్యదర్శి రాఘవయ్య, అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, కోకాకోలా, సంగం డెయిరీ, సిసిల్ సంస్థల సేఫ్టీ అధికారులు, వివిధ పరిశ్రమల యాజమాన్యాలు, భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు.


