అక్షర ఆంధ్ర కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో అక్షర ఆంధ్రా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో అక్షర ఆంధ్రా క్రింద శిక్షణ పొందుతున్న వయోజనుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, రానున్న పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని సూచించారు. పటిష్ట పర్యవేక్షణ ఉండాలని, కేంద్రంలో అభ్యసిస్తున్న ప్రతీ ఒక్కరూ చక్కని చదవడం, రాయడం రావాలని ఆదేశించారు. అక్షర ఆంధ్రాలో గుంటూరు జిల్లా ఆదర్శంగా నిలవాలని సూచించారు. తమ కేంద్రంలో 140 మంది శిక్షణ పొందుతున్నారని, మండలంలో 4100 మంది అక్షర ఆంధ్రా కార్యక్రమంలో ఉన్నారని అక్షర ఆంధ్రా పర్యవేక్షకులు దాసరి వెంకటస్వామి వివరించారు. ప్రతి రోజూ సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నామని. డ్వాక్రా, ఉపాధి హామీ సభ్యులు ఇందులో అభ్యాసకులుగా, అక్షరాస్యులుగా ఉన్న సభ్యులు వాలంటీర్లుగా ఒక్కొక్కరు 10 మందికి బోధిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కె శిల్ప పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్
నరసరావుపేట: పిన్నెల్లి ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ బుధవారం మున్సిపల్ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రామ ప్రజలు శాంతిని బలంగా కోరుకుంటున్నారని, పోలీసులు, ప్రజలు, అధికారుల సహకారంతో హింసను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ బి.కష్ణారావు, డీఆర్వో నారదముని, ఆర్డీవో మురళీకృష్ణ, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.
సాల్మన్ హత్య బాధాకరం
గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో జరిగిన మందా సాల్మన్ హత్య చాలా దురదృష్టకరం, బాధాకరమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్.జవహర్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంఘటనలో దాడిచేసిన వారు, దాడికి గురైన వారు ఇరువురూ దళితులే అన్నారు. ప్రాణం పోయింది దళితుడిది కాబట్టి తమ కమిషన్‌కు బాధ్యత ఉందన్నారు. చాలా పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో నిజనిర్ధారణకు ఒక కమిటీని వేశామని, వీరు బాధితులతోపాటు మిగిలిన వారి నుంచి సమాచారం సేకరించి ఒక నివేదికను తయారుచేశారని చెప్పారు.


