వెట్టి చాకిరి నిర్మూలనలో భాగస్వాములు కావాలి
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా వెట్టి చాకిరి వ్యవస్థ (బాండెడ్ లేబర్) నిర్మూలనపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమష్టి కృషితోనే వెట్టి చాకిరీ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. వెట్టి చాకిరి వ్యవస్థ ఒక సామాజిక దురాచారమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, గౌరవప్రద జీవనంకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ప్రభుత్వం వెట్టి చాకిరి వ్య వస్థ నిర్మూలన చట్టం ద్వారా ఈ వ్యవస్థను పూర్తి గా నిషేధించిందన్నారు. చట్టంపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం, బాధితులను గుర్తించడం, పునరావాసం కల్పించడంపై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా బలవంతపు కార్మిక వ్యవస్థ, అప్పుల బానిసత్వం వంటి ఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచా రం ఇవ్వాలన్నారు. బాధితులకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. సామాజిక సంస్థలు, స్వచ్ఛందసంస్థలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ గౌర వప్రదమైన జీవితం గడపాలనే లక్ష్యంతో సమాజం ముందుకు సాగాలని కలెక్టర్ కోరారు. డీఆర్వో షేఖ్‌ఖాజావలి, కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ.గాయత్రి దేవి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, డీపీఓ బీవీ నాగ సాయి కుమార్, కార్మిక శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


