నేతలను అడ్డుకున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

నేతలను అడ్డుకున్న పోలీసులు

Feb 5 2026 7:48 AM | Updated on Feb 5 2026 7:48 AM

నేతలన

నేతలను అడ్డుకున్న పోలీసులు

నేతలను అడ్డుకున్న పోలీసులు

గుంటూరులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు భారీగా హాజరైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: అడుగడుగునా అంతులేని అభిమానం... ఎక్కడికక్కడ కట్టడికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించినా ఆగని జనసందోహం... ఇవీ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనలో కనిపించిన దృశ్యాలు. అధికార పార్టీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం పరిశీలించి, కుటుంబసభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌కు అడుగుడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం, విధ్వంస పాలనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. వైఎస్‌ జగన్‌ కార్యక్రమానికి తరలివచ్చారు. ఆయన్ను చూసేందుకు పోటెత్తారు. తాడేపల్లి నుంచి గుంటూరు, సిద్ధార్థనగర్‌లోని రాంబాబు ఇంటికి ఆయన చేరుకోవడానికి దాదాపు 6 గంటలు పట్టింది.

తరలివచ్చిన అభిమానులు

కుంచనపల్లి క్రాస్‌రోడ్స్‌, కాజ టోల్‌గేట్‌, మంగళగిరి బైపాస్‌, కాకాని, ఏటుకూరు బైపాస్‌ సర్వీస్‌ రోడ్‌, గుంటూరులోని కేవీపీ (వీఐపీ) రోడ్‌, చుట్టుగుంట, కలెక్టర్‌ ఆఫీస్‌, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మీదుగా సిద్ధార్థనగర్‌లోని అంబటి రాంబాబు నివాసానికి వైఎస్‌ జగన్‌ చేరుకున్నారు. ఉదయం 10.40 గంటలకు బయలుదేరిన ఆయన.. అంబటి ఇంటికి చేరే సరికి సాయంత్రం 4.35 గంటలు అయ్యింది. మరోవైపు జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతి చోటా ప్రయత్నించింది. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటివరకూ ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. జగన్‌ కాన్వాయ్‌ను మాత్రం అనుమతించి.. ఆయన వెనుక వస్తున్న వాహనాలను, జనసందోహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డంకుల మధ్య కూడా జగన్‌ పర్యటన విజయవంతం అయ్యింది. ఒకటి, రెండు చోట్ల లారీలను కూడా రోడ్డు మీద పెట్టి అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన వెంట తరలివచ్చారు. గుంటూరు నగరం జనసంద్రంగా మారింది. పల్నాడు జిల్లా నుంచి ఎవ్వరూ రాకుండా దిగ్బంధించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వద్ద, సత్తెనపల్లి మండం నందిగం అడ్డరోడ్డు వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మరీ అడ్డంకులు సృష్టించారు.

బందోబస్తు హడావుడి

ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని గుంటూరు రూరల్‌ మండలం బొంతపాడు వై జంక్షన్‌ వద్ద డీఎస్పీలు భానూదయ, అరవింద్‌తోపాటు సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, రోప్‌ పార్టీలు, ప్రత్యేక బలగాలు బందోబస్తు నిర్వహించాయి. డ్రోన్‌ కెమెరాలతో పర్యటనపై డేగ కన్ను వేశారు. శనివారం రాత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద టీడీపీ మూకలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన ప్రత్తిపాడు నియోజకవర్గం బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్‌యాదవ్‌ను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. అంబటి ఇంటికి వెళుతున్న దారిలో ఏటుకూరు బైపాస్‌లోగల ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్‌ కార్యాలయం వద్ద టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన అశోక్‌, పూర్తిగా ధ్వంసమైన కారును జగనన్న తన వాహనం నుంచి అభిమానుల మధ్యనే పరిశీలించారు.

ఎట్టకేలకు...

ఉదయం 10 గంటల నుంచి అంబటి నివాసం దగ్గరకు వస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులను పోలీసులు బారికేడ్లను అడ్డంగా పెట్టి అడ్డుకున్నారు. సిద్ధార్థనగర్‌కు వెళ్లే అన్ని రహదారులను మూసి వేశారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేశారు. గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్‌ నుంచి అంబటి నివాసానికి వచ్చేందుకు మూడు గంటలకుపైగా సమయం పట్టింది.

ముఖ్య నేతలు హాజరు

కార్యక్రమానికి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్‌, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, విడదల రజిని, పేరి నాని, మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్‌, నంబూరు శంకరరావు, సింఽహాద్రి రమేష్‌, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నందిగం సురేష్‌, సమన్వయకర్తలు షేక్‌ నూరిఫాతిమా, వనమా బాలవజ్రబాబు (డైమండ్‌బాబు), దొంతిరెడ్డి వేమారెడ్డి, అంబటి మురళీకృష్ణ, వరికూటి అశోక్‌బాబు, బలసాని కిరణ్‌, ఈవూరు గణేష్‌, డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, అవినాష్‌, నాయకులు పోతుల మహేష్‌, షేక్‌ గులాం రసూల్‌, నిమ్మకాయల రాజనారాయణ, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అభివాదం

చేస్తున్న జగనన్న

అంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎంవైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనలో పాల్గొనేందుకు సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్‌, ముప్పాళ్ళ, రాజుపాలెం, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాలకు చెందిన 37 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రత్యేక వాహనంలో గుంటూరు బయలుదేరారు. సత్తెనపల్లి నందిగం అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు వారిని అడ్డుకున్నారు. గుంటూరు సమీపంలోకి చేరుకోగానే హైవేపై జన సంద్రం పోటెత్తింది. జననేతను చూసేందుకు అభిమానులు మండే ఎండను సైతం లెక్కచేయక బారులు తీరారు. అభిమానులు, పార్టీ శ్రేణులు తరలిరావడంతో హైవేతోపాటు ఏటుకూరు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. గుంటూరు రూరల్‌ మండలం ఏటుకూరు ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో మెయిన్‌ హైవేపై నుండి సర్వీసు రోడ్డులోనికి జగన్‌ కాన్వాయ్‌ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రవేశించింది. కాన్వాయ్‌ కనిపించగానే జననేతను చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు హైవేపైకి పరుగులు పెట్టారు. చేతులు ఊపుతూ, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. దీంతో జగన్‌ కారుపై నుండే ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

అంబటి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని, భయపడవద్దని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘మాజీ మంత్రి అంబటి కాపు కులంలో ఒక టైగర్‌. విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్‌ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టడం తగదు. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాలన్నింటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీ సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని’’ హెచ్చరించారు.

నేతలను అడ్డుకున్న పోలీసులు 1
1/2

నేతలను అడ్డుకున్న పోలీసులు

నేతలను అడ్డుకున్న పోలీసులు 2
2/2

నేతలను అడ్డుకున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement