‘పది’ పైనే గురి
టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల సంఖ్య 490 పరీక్షలకు హాజరు కానున్న 27,260 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాలు
గుంటూరు ఎడ్యుకేషన్: మార్చి 16 నుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు తదేక దీక్షతో సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పరీక్షల్లో అధిక మార్కుల సాధన దిశగా వారిపై శ్రద్ధ చూపిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని 490 ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, సాంఘిక, బీసీ సంక్షేమ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల నుంచి పరీక్షలకు సన్నద్ధమవుతున్న 27,260 మంది విద్యార్థుల కోసం 149 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
● ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిధిలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.
● మారుమూల ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వచ్చి సాయంత్రం వరకు తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహారం లేక అర్ధాకలితో ఉంటున్నారు.
● దీనిపై తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదేశాలతో ఇటీవల పలు మండలాల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని అల్పాహారం అందజేత ప్రారంభించారు.
● పరీక్షల్లో అధిక మార్కుల సాధన కోసం జిల్లా పరిషత్ ద్వారా ముద్రించిన విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్‌ను ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్ విద్యార్థులకు పంపిణీ చేశారు.
● జెడ్పీ నిధులతో ప్రతి ఏటా స్టడీ మెటీరియల్‌తో పాటు అల్పాహారానికి సైతం నిధులు కేటాయిస్తున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు జెడ్పీ నుంచి అల్పాహారం కోసం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం


