గుంటూరులో 104 ఉద్యోగుల ధర్నా
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : 104 ఉద్యోగులకు భవ్య హెల్త్ కేర్ సర్వీస్ సంస్థ చేస్తున్న అన్యాయానికి నిరసనగా జిల్లా కలెక్టరేట్ వద్ద మాస్ లీవ్ పెట్టి మంగళవారం ధర్నా చేపట్టారు. ధర్నాకు యూనియన్ గౌరవ అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, ఎల్‌ఐసీ నాయకులు వీవీకే సురేష్, ఎం. రాజేశ్వరరావు, 108 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, వై.శివశంకర్‌లు మద్దతు తెలిపారు.
● లక్ష్మణరావు మాట్లాడుతూ 104 ఉద్యోగులకు తగ్గించిన వేతనాలు, రద్దు చేసిన క్యాజువల్ లీవులు పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగులపై భవ్య యజమాన్యం వేధింపులు ఆపాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి చాట్ల రాంబాబుకు ఇచ్చిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వారిపై వేధింపులకు పాల్పడాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఐదు ఏళ్లు సర్వీసు దాటిన డ్రైవర్లకు స్లాబ్ వేతనాలు చెల్లించాలన్నారు. డీఈవోలకు డ్యూటీలను విధించకుండా జీవో ప్రకారం రూ.18,500 వేతనం చెల్లించాలన్నారు. ప్రజలకు అవసరమైన మందులు 104 వాహనంలో అందుబాటులో ఉంచాలన్నారు.
● ఎల్‌ఐసీ నాయకులు వీవీకే సురేష్, 108 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబు, వై.శివశంకర్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించడంలో వెనుకబడిందన్నారు. భవ్య యాజమాన్యం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. రోడ్లపైకి వచ్చే ఆందోళన చేపట్టానికి పూర్తి బాధ్యత భవ్య యాజమాన్యందే అన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం మొండి వైఖరి వీడి సమస్యలు పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలన్నారు.
● ధర్నా అనంతరం డీఆర్వో షేక్ ఖాజావలిని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరంట్ల సురేష్ కుమార్, శ్రీహర్ష, కోశాధికారి ఐ.నాగులు, నాయకులు సుధా, ఏడుకొండలు, సత్యరాజ్, బాలకృష్ణ, జి.సుబ్బారావు, శంకర్, విజయ్, సాయిరాం, వెంకట్రావు, హరి, విజయ్ 108 ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు షేక్ హసన్, హాసన్ కమల్, రాజకుమార్, బాజీ, అశోక్, తదితరులు పాల్గొన్నారు.


