బహిర్గతం చేయాలి
ఆర్వోబీ నిర్మాణ ప్లాన్
● ప్లాన్ లేకుండా బ్రిడ్జి నిర్మాణం
గుంటూరులోనే జరుగుతోంది
● శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో
చట్టబద్ధంగా వ్యవహరించాలి
● కేంద్ర ప్రభుత్వ నిబంధనల
మేరకు సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలి
● ముందు చూపు లేకుండా బ్రిడ్జి
కూల్చివేతతో నరకాన్ని చూస్తున్న ప్రజలు
● అధికారుల ఏకపక్ష వైఖరి ప్రజలందర్నీ
ఇబ్బందుల్లోకి నెట్టింది
● భూ సేకరణ చేస్తామన్న
కేంద్ర మంత్రి పెమ్మసాని
● క్షేత్రస్థాయిలో నిబంధనలు
పాటించేలా చూడాలి
● బెటర్ శంకర్ విలాస్ ఫ్లై ఓవర్
జేఏసీ కన్వీనర్ ఎల్.ఎస్.భారవి
గుంటూరుఎడ్యుకేషన్: గుంటూరు నగరంలో శంకర్‌విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కూల్చివేసి, కొత్తది నిర్మించే వ్యవహారంలో అధికార యంత్రాంగం చేసిన తప్పి దాలతో ప్రజలు నరకాన్ని చవి చూస్తున్నారని బెటర్ శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ సాధన జేఏసీ కన్వీన్ ఎల్.ఎస్.భారవి అన్నారు. ప్లాన్ లేకుండా బ్రిడ్జి నిర్మాణం ఒక్క గుంటూరులోనే జరుగుతోందన్నారు. మంగళవారం గుంటూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రణాళిక లేకుండా ఆగస్టు 9న పాత బ్రిడ్జి కూల్చివేసిన తరువాత గుంటూరు నగరంలో ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ కష్టాలు చవి చూస్తున్నా రని చెప్పారు. సాంకేతికంగా సర్వే నిర్వహించకుండా ఏకపక్షంగా కూల్చివేసిన అధికారులు కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు.
అధికారుల తప్పిదాలపై
మొదటి నుంచీ చెబుతున్నాం
బ్రిడ్జి కూల్చివేతకు రంగం సిద్ధం చేసిన సమయంలోనే అధికారులు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి, ఏకపక్ష విధానాలపై జేఏసీ పరంగా తాము వెలుగులోకి తెచ్చామని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణానికి ముందుగా ఆర్‌యూబీ నిర్మించాలని చేసిన ప్రతిపాదనలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తాజాగా దృష్టి సారించడం మంచి విషయమేనని అన్నారు. బ్రిడ్జి కూల్చివేత, పునఃనిర్మాణ పనుల పరిశీలనకు హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ నెల రోజుల క్రితం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన సమయంలో నిర్మాణ ప్లాన్‌ను ప్రజలకు తెలిసే విధంగా బహిరంగ పర్చాలని తాము చేసిన డిమాండ్‌పై అధికార యంత్రాంగం ఇప్పటికీ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు.
ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత
పాత బ్రిడ్జి స్థానంలో ఎటువంటి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడుతున్నారో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. 930 మీటర్ల పొడవు, 74 అడుగుల వెడల్పుతో చేపడుతున్న బ్రిడ్జి కారణంగా రెండు వైపులా సర్వీసు రోడ్లు కేవలం 17 అడుగుల మేర కు ఉంటాయని, అవి వాహనాల రాకపోకలకు, పార్కింగ్‌కు ఏ మాత్రం సరిపోవన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలను కూల్చివేయకుండా ఒకే పిల్లర్‌తో ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని జేఏసీ తరఫున మొదటి నుంచి చేస్తున్న డిమాండ్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణానికి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎట్టకేలకు గుర్తించిన మీదట భూ సేకరణ జరుపుతామని ప్రకటించడం మంచి పరిణామమేనని, దీనిపై జిల్లా కలెక్టర్‌తో నోటిఫికేషన్ జారీ చేయించి, నిబంధనల ప్రకారం చేయించాలని కోరారు. 930 మీటర్ల పొడవు, ఎర్త్‌వాల్‌తో కూడిన బ్రిడ్జి నిర్మాణం కారణంగా ఏసీ కళాశాల కూడలిలో యూ టర్న్ తీసుకునే పరిస్థితులు ఉండవని, హిందూ కళాశాల కూడలికి వెళ్లి అక్కడ టర్న్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫలితంగా ట్రాఫిక్ మొత్తం బ్రిడ్జిపైనే పడుతుందని, అంబులెన్స్‌లు, అత్యవసర ఆస్పత్రులకు వెళ్లాల్సిన రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ముందుగానే ఆర్‌యూబీ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధులు కమల్‌కాంత్, మద్ది రాధాకృష్ణ, బెల్లంకొండ శ్రీనివాసరావు, వల్లూరి సదాశివరావు పాల్గొన్నారు.


