అంధుల క్రికెట్‌కు ప్రోత్సాహం నామమాత్రం
పదేళ్లుగా జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న జట్టు
భారత జట్టుకు కూడా రాష్ట్రం నుంచే కెప్టెన్
ప్రైవేటు సంస్థలు కనికరిస్తేనే మ్యాచ్‌లు
ప్రభుత్వం ఆదుకోవాలని అంధ క్రికెటర్లు వినతి
క్రికెట్‌కే జీవితం అంకితం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒకవైపు అంధత్వం, మరోవైపు పేదరికం... సమాజంలోనూ చిన్నచూపు.. ఇన్ని ఆటంకాలను ఎదుర్కొంటూ క్రికెట్‌లో రాణిస్తున్నారు కొందరు అంధులు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారిని ప్రోత్సహించడంలో ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. కొన్ని ప్రైవేటు సంస్థల దాతృత్వంతోనే అంధుల క్రికెట్ పోటీలు రాష్ట్రంలో జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. స్థానిక అరండల్‌పేటలోని ఏసీఏ క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బ్‌లైండ్ ఏపీ, విజువల్లీ బ్‌లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఫరెంట్ డిసేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంయుక్తాధ్వర్యంలో అంధుల క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. మొత్తం 42 మంది 3 జట్లుగా మ్యాచ్‌లు ఆడుతున్నారు. ప్రతిభ చాటిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నారు. వీరికి మాజీ భారత అంతర్జాతీయ బ్‌లైండ్ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి సాయం చేసి, మెంటార్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. వారికి ప్రతిభ చాటే అవకాశ ం కల్పించారు.
దేశంలో మనమే టాప్
గత పదేళ్లుగా జాతీయ క్రికెట్‌లో రాష్ట్ర జట్టు ప్రథమ స్థానంలో నిలుస్తోంది. భారత జట్టుకు కూడా మన రాష్ట్రం నుంచే కెప్టెన్‌గా ఎంపికవుతూ వస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం వీరిని కనీసం పట్టించుకోవడం లేదు. అంధ క్రికెటర్లు మైదానంలో ప్రతిభ కనబరుస్తున్నారు. వీరి కోసం నిధుల కేటాయింపు కూడా లేదు. గురువారం మ్యాచ్‌లను చూసేందుకు వచ్చిన సంబంధిత శాఖ చైర్మన్ జి.నారాయణ స్వామి మాట్లాడుతూ అంధ క్రికెటర్ల అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
నేను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించా. నా జీవితం క్రికెట్‌కే అంకితం. రాష్ట్రం నుంచి గత పదేళ్లలో ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఆడారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఇంత మంది దేశానికి ఆడితే... ప్రభుత్వం సాయం అందిస్తే చాలామంది ఆడతారు. ప్రస్తుతం రాష్ట్రంలో 150 మంది వరకు ఆడుతున్నారు. వీరి సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నా. కొందరు సాయం అందిస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది.
– ఐ.అజయ్ కుమార్ రెడ్డి,
అంధ క్రికెటర్ల మెంటార్
‘అంధ’ంగా ఆడినా అదే వేదన