మంగళగిరి టౌన్: యువతలోని వినూత్న ఆలోచనలను మెరుగుపట్టి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌ను మంగళగిరిలో ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగర పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న మయూరి టెక్ పార్క్‌లో ఈ హబ్ ఏర్పాటైంది. దీనిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. యువతకు ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను సీఎం పరిశీలిస్తారని ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ సూర్యతేజ తెలిపారు.
శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
తాడికొండ: అమరావతి రాజధానిలోని వేంకటపాలెంలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం యాగశాలలో పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహించారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట, అధివాసం, సర్వదైవత్య హోమం చేపట్టారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, సందీప్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
108 కిలోల గంధంతో అభిషేకార్చన
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): స్థానిక అరండల్‌పేట శ్రీఅష్టలక్ష్మీ మందిరం కోటి కుంకుమార్చనలో భాగంగా శ్రావణ మంగళవారం స్వామి, అమ్మవారికి విశేష పూజలు, శ్రీచక్ర మహామేరుకు విశేష అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం 108 కిలోల గంధంతో విశేష అభిషేకార్చన భక్తిశ్రద్ధలతో చేపట్టారు. హారతులు, మంత్రపుష్పం అనంతరం కుంకుమార్చనకు హాజరైన వారు స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ, అన్న ప్రసాదాలు నిర్వాహకులు అందించారు. నిర్వాహకులు మర్రిపాటి ప్రసాద్‌శర్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అవగాహన ఫ్లెక్సీ ఆవిష్కరణ
గుంటూరు మెడికల్: ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ప్రచార ఫ్లెక్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం ఉదయం 9 గంటలకు డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్ శివశంకర్ బాబు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అన్నపూర్ణ, డీపీహెచ్‌ఎన్ డాక్టర్ ప్రియాంక, స్టాటిస్టికల్ అధికారిణి పద్మజ, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజు నాయక్, ఆరోగ్య విస్తరణ అధికారి గణేష్, తదితరులు పాల్గొన్నారు.