
ఎమ్మెల్యే ధూళిపాళ్లకు సూట్‌కేసులు
రైతుల తరఫున పోరాడితే కేసులు...
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రైతుల పక్షాన పోరాడే వారిపై పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కేసులు పెడుతున్నారని, ఆయనకు మాత్రం సూట్‌కేసులు వెళ్తున్నాయని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. కూటమి ఏడాదిన్నర కాలం పాలనలో రైతుల సమస్యలను నరేంద్ర పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గుంటూరులోని తన కార్యాలయంలో అంబటి మురళీకృష్ణ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు చానల్‌కు గండ్లు పడ్డాయన్నారు. ఫలితంగా పెదకాకానిలో 11 వేల ఎకరాలు, చేబ్రోలులో 5 వేల ఎకరాలు, పొన్నూరు రూరల్‌లో 15 వేల ఎకరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. కొండవీటి వాగు ప్రవాహం గుంటూరు చానల్‌లోకి చేరడంతో పొలాలన్నీ దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇంతటి భారీ నష్టం సంభవిస్తే గుంటూరు చానల్ లాకులు మూసినట్టు ప్రభుత్వం చెప్పడం అబద్ధమేనన్నారు. అయితే ఆ నీరంతా ఆకాశం నుంచి వచ్చిందా, భూమి లోపలి నుంచి పైకి వచ్చిందా అనేది కూడా ప్రభుత్వమే చెప్పాలన్నారు. రైతులు మాత్రం కొండవీటి వాగు నుంచే భారీగా నీరు వచ్చి నష్టం చేసిందని చెప్పడాన్ని ఇక్కడ గమనించాలన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతులను ఆదుకోవాలి
గత ఏడాది పంటలు మునిగిపోయిన నేపథ్యంలో రూ.16 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చామని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్నారని, అయితే ఈ ఏడాది నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వనవసరం లేదా అన్ని అంబటి మురళీకృష్ణ ప్రశ్నించారు. అంతేగాక గతంలోనే నష్టపరిహారం చెల్లించామని, కాల్వలు కూడా బాగు చేయించామని ఎమ్మెల్యే నరేంద్ర చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. అదే నిజమైతే ఈ వర్షాలకు గండ్లు ఎలా పడ్డాయో చెప్పాలన్నారు. ఈ ఏడాది సార్వా సాగుకు రైతులు ఇప్పటికే ఎకరాకు రెండుసార్లు రూ. 20 వేలు ఖర్చు చేశారన్నారు. మూడోసారి నారుమడి వేసే పరిస్థితి కూడా లేదన్నారు. తక్షణమే ఎకరాకు తాత్కాలిక పరిహారంగా రూ.10 వేల నగదు, ఉచితంగా ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలన్నారు. ఇక అన్నదాతలు ఇంతటి దయనీయ స్థితిలో ఉంటే రెండు నెలలుగా ఎమ్మెల్యే నరేంద్ర నియోజకవర్గంలోనే కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. పంటల నష్టపోయినట్టు రైతులు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెబితే... పంటలు పోతే పోయాయని, రియల్ ఎస్టేట్‌కు ఇవ్వాలని చెప్పడం ఆయన దుర్బుద్ధిని తెలియజేస్తోందన్నారు. రైతుల పక్షాన పోరాడుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చేబ్రోలు, కొమ్మమూరు బ్రిడ్జికి సంబంధించి గుంతలు తీసి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద నీరు భారీగా వచ్చి నడిరోడ్డుపై గుండాలు ఏర్పడ్డాయన్నారు. దీనిపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని అంబటి మురళీకృష్ణ సూటిగా ప్రశ్నించారు.
పొన్నూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
అంబటి మురళీకృష్ణ ఆరోపణ