
బైకును ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
మేదరమెట్ల: వెనుక నుంచి వచ్చిన లారీ బైకును ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన కొరిశపాడు మండలం మేదరమెట్ల ఫైలాన్ సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు జే.పంగులూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన గోలమూడి కుమార్ (37) భార్య వెన్నెలతో కలసి ఒంగోలులో ఉంటున్న కుమారుని కలసి మోటారు బైకుపై తిరిగి స్వగ్రామం వస్తున్నారు. బైకు ఫైలాన్ సమీపానికి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ మోటారు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమార్‌ను లారీ కొద్ది దూరం లాక్కొనిపోయింది. దీంతో కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్ భార్య వెన్నెల రోడ్డు పక్కన పడిపోయింది. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. తన కళ్ల ముందే భర్త విగతజీవిగా మారడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల ఎస్సై మహ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.