
సీజీహెచ్‌ఎస్‌లో ఆధునిక సౌకర్యాలు
గుంటూరు మెడికల్: మారుతున్న కాలానుగణంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్(సీజీహెచ్‌ఎస్) వెల్‌నెస్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.సీహెచ్.కోటేశ్వరరావు పేర్కొన్నారు. నగరంపాలెంలోని సీజీహెచ్‌ఎస్ కార్యాలయంలో సోమవారం నూతనంగా ఏర్పాటైన లేబొరేటరీ, ఇంజెక్షన్, బీపీ పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి సీజీహెచ్‌ఎస్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బి.హేమాసుందరి అధ్యక్షత వహించారు. డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా, సీజీహెచ్‌ఎస్ ఆరోగ్య కేంద్రాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరింత మెరుగైన స్థితికి తీసుకొస్తామని వెల్లడించారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.విద్య మాట్లాడుతూ నూతన ప్రారంభోత్సవాల ద్వారా మరిన్ని వైద్య సౌకర్యాలకు అంకురార్పణ జరిగిందని తెలిపారు. రోగుల ఆరోగ్య సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పారు. సీజీహెచ్‌ఎస్ లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గుమ్మడి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ ఆస్పత్రిలో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బి.హేమా సుందరి, ఫార్మాసిస్టు ఆయోషా బేగం, సునీల్, లేబొరేటరీ అసిస్టెంట్లు మురళి, రామారావు, సిబ్బంది మోహన్, మక్బూల్, వెంకటేశ్వర్లు, రత్నరాజు, నందమణి పాల్గొన్నారు.
చీఫ్ మెడికల్ ఆఫీసర్ కోటేశ్వరరావు