కృష్ణవేణి.. ఉగ్రరూపిణి | - | Sakshi
Sakshi News home page

కృష్ణవేణి.. ఉగ్రరూపిణి

Aug 19 2025 4:46 AM | Updated on Aug 19 2025 4:46 AM

కృష్ణవేణి.. ఉగ్రరూపిణి

కృష్ణవేణి.. ఉగ్రరూపిణి

ఆందోళన చెందుతున్న జిల్లా రైతాంగం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పంటలు మరోసారి వర్షం ప్రారంభంతో రైతుల్లో గుబులు పెరుగుతున్న కృష్ణమ్మ వరద ఉధృతి ఏడు లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అంచనా అప్రమత్తం అయిన గుంటూరు, బాపట్ల జిల్లాల అధికారులు పునరావాస కేంద్రాలకు తీర ప్రాంత వాసుల తరలింపు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఒకవైపు కృష్ణమ్మ వరద దోబూచులాటలు.. మరోవైపు ముసురుతో రైతులకు కంటి మీద కునుకు కరువైంది. వరుణుడి ప్రకోపంతో అల్లాడుతున్నారు. వర్షాలు తగ్గడంతో పంట ముంపు నుంచి బయటపడతామనే ఆశతో ఉన్న రైతులకు నిరాశే ఎదురైంది. మళ్లీ వర్షాలు కురుస్తుండటం, వాతావరణ శాఖ అధికారులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో పాటు ఉపరితల అవర్తన ప్రభావంతో జిల్లాలోని 15 మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా కాకుమాను మండలంలో 37.2 మిల్లీ మీటర్లు పడగా, అత్యల్పంగా గుంటూరు పశ్చిమలో 0.6 మి.మీ. పడింది. సగటున 8.3 మి.మీ వర్షపాతం నమోదైంది.

బ్యారేజీకి వరద నీరు తాకిడి

మరోవైపు ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి క్రమేపీ పెరుగుతోంది. రెండు రోజుల కిందట రెండో ప్రమాద హెచ్చరిక వరకూ వెళ్లి, మళ్లీ వరద ప్రవాహం తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ నిదానంగా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. సోమవారం బ్యారేజీకి వచ్చిన 2.84 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం నాటికి 3.97 లక్షల క్యూసెక్కుల నీరు వద్దకు వచ్చే అవకాశముందని, ఆ తర్వాత రోజుకు సుమారు ఏడు లక్షల నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు కొనసాగితే మరింత ఉధృతి పెరిగే అవకాశం కనపడుతోంది.

26 క్రస్ట్‌గేట్ల ద్వారా సాగర్‌ నీటి విడుదల

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి సోమవారం 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 2,51,182 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌ జలాశయానికి 3,31,699 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. రెంటచింతల మండలం సత్రశాల వద్ద నున్న నాగా ర్జున సాగర్‌ టైల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ నుంచి 16 క్రస్ట్‌గేట్లు ద్వారా 2,92,192 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు.

నిండుకుండలా పులి చింతల

మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 2,47,951 క్యూసెక్కులు వచ్చి చేరింది. దిగువకు 10 క్రష్ట్‌ గేట్లద్వారా 3,10,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తెలంగాణతోపాటు, ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం పులిచింతల నుంచి 2,51,743 క్యూసెక్కులు, పాలేరు నుంచి 25,716 క్యూసెక్కులు, వజినేపల్లి నుంచి 1,76,542 క్యూసెక్కులు, కట్లేరు నుంచి 10 క్యూసెక్కులు, కొండవీటి వాగు నుంచి 2,100 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుందని సమాచారం. తెలంగాణాలో పడుతున్న భారీ వర్షాలకు మూసీతో పాటు ఇతర వాగుల నుంచి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

పుష్కర ఘాట్ల వద్ద కంచె ఏర్పాటు

తాడేపల్లి రూరల్‌: కృష్ణా నదికి వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌ దిగువ ప్రాంతంలోని పుష్కర ఘాట్లలో భద్రత దృష్ట్యా సోమవారం తాడేపల్లి పోలీసులు ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఖాజావలి మాట్లాడుతూ కృష్ణా నది ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్న వరద నీటిని ఇరిగేషన్‌ అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారన్నారు. పుష్కర ఘాట్ల వద్ద సందర్శకులు మెట్ల మీద నుంచి నీళ్లలోకి దిగుతున్నారని తెలిపారు. ప్రమాదాలను నివారించేందుకు పుష్కర ఘాట్లన్నింటిలో కంచెను ఏర్పాటు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. తీరంలో ప్రజలు నదిలోకి దిగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement