
అంబేడ్కర్ రాజ్యాంగానికి అవమానం
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగంరాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య రెడ్‌బుక్ రాజ్యాంగంతో కూటమిఅరాచక పాలన కూటమి ప్రభుత్వ విధానాలపై విద్యార్థుల నిరసన ప్రభుత్వ జీవోలు తగులబెట్టి ఆందోళన
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవమానించే రీతిలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏకంగా అంబేడ్కర్ రాజ్యాంగం తమకు అక్కర్లేదని, సొంతంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తయారు చేసుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం పాదాల చెంత విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తి పోశారు. జీవో కాపీలను తగులబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సహించేది లేదని హెచ్చరించారు.
రాజ్యాంగం అవహేళన
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైతన్య మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నిరుపేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసేంత నీచానికి దిగజారారని ధ్వజమెత్తారు. కనీసం మౌలిక వసతులు కూడా లేక సంక్షేమ హాస్టళ్లన్నీ సంక్షోభంలో కూరుకుపోయాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వారి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన గురుతర బాధ్యత విద్యార్థి సంఘాలపైనే ఉందని పేర్కొన్నారు. విద్యా శాఖా మంత్రి లోకేష్ నిజాయతీపరుడైతే ముందుగా విద్యా సంస్థలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. అది మానేసి విద్యార్థి సంఘాల ప్రవేశంపై నిషేధం వంటి దుర్మార్గపూరితమైన చర్యలకు దిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంపతి నాగరాజు, గుంటూరు నగర అధ్యక్షుడు గుడిశెట్టి రవీంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేష్, కరీం, కిరణ్, రామకృష్ణ, మస్తాన్, జిల్లా కార్యదర్శులు అరుణ్, సన్ని, వినయ్, సతీష్ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేటేటి నవీన్, గుంటూరు తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు సాజిద్, తెనాలి నియోజకవర్గం అధ్యక్షుడు శామ్యూల్, ప్రత్తిపాడు నియోజకవర్గం అధ్యక్షుడు కెనడీ, మంగళగిరి నియోజకవర్గం అధ్యక్షుడు సందీప్ పాల్గొన్నారు.