వేర్వేరు గంజాయి కేసుల్లో 15 మంది అరెస్టు
● కొల్లిపర మండల కేంద్రం డంపింగ్ యార్డ్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఆర్. ఉమేష్, ఎస్‌ఐ పి. కోటేశ్వరరావు సిబ్బందితో కలిసి దాడులు చేసి, ఏడుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 1600 గ్రాముల గంజాయిని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో గంజాయి విక్రేతలు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన పంది నాగ యుగంధర్ బాబు, షేక్ రకీబ్, పెదకాకాని మండలం ఉప్పలపాడుకి చెందిన రామిశెట్టి శ్యామ్‌వెంకట్ అలియాస్ బాబి, దుగునూరి మోహన్ తేజ, కొల్లిపర మండలం తూములూరుకు చెందిన కనపర్తి సుందరరావు, గంజాయి తాగుతున్న షేక్ అబ్దుల్ కరీం, విష్ణుమొలకల భరత్ కుమార్ ఉన్నారు. నిందితుల్లోని నాగ యుగంధర్ బాబు, షేక్ రకీబ్‌లు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి, 15 గ్రాములు ప్యాకెట్లుగా తయారు చేసి తెనాలి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. వీరిలో పలు కేసుల్లో నిందితుడైన కనపర్తి సుందరరావు అపహరించిన మరో మూడు బైకులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పలుమార్లు గంజాయి కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. చాకచక్యంగా రెండు ఘటనల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న సిబ్బందిని డీఎసీ్‌ప్ అభినందించారు. సమావేశంలో త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్‌బాబు, రూరల్ సీఐ ఆర్. ఉమేష్, కొల్లిపర ఎస్‌ఐ పి. కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
3300 గ్రాములు స్వాధీనం నిందితుడు ఒకరు పరారీ
తెనాలి రూరల్: రెండు వేర్వేరు కేసుల్లో 15 మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి, 3300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి. జనార్దనరావు వివరాలు వెల్లడించారు. స్థానిక సుందరయ్యనగర్‌లో యువకులు గంజాయి తాగుతున్నట్లు సమాచారం అందుకున్న త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్ బాబు సిబ్బందితో దాడి చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారయ్యారు. వారి నుంచి 1700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో మృత్యుంజయ కుమార్ సింగ్, కరికట్ట మధు, దాది షణ్ముఖ అలియాస్ బన్ను, పఠాన్ మహమ్మద్ అలియాస్ ఫర్దీన్ ఖాన్, ఆకుల మారన్న అలియాస్ మారి, బుంగ అలియాస్ సయ్యద్ సైదా, ఆరిమళ్ల విజయ్ కుమార్ అలియాస్ జగ్గం నాని, సంతోష్ కుమార్ ఉన్నారు. వీరిలో మృత్యుంజయ కుమార్ సింగ్ బిహార్ వాసి. ఆ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తెనాలి ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.