
తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు
బండారుపల్లి సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్న టీడీపీ నేతలు సీనియర్లను సంప్రదించకుండా షాడో ఎమ్మెల్యే రూ.20 లక్షలకు పదవి అమ్ముకున్నాడని ఆరోపణ ఎమ్మెల్యే కార్యాలయంతో చర్చలు ఫలించక పోవడంతో ప్రమాణ స్వీకారం వాయిదా
తాడికొండ: మండలంలోని బండారుపల్లి కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారాన్ని తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా పార్టీని మోస్తున్న తమకు తెలియకుండా ఇటీవల పార్టీలో చేరిన గుంటుపల్లి పానయ్యకు పదవిని షాడో ఎమ్మెల్యే రూ.20 లక్షలకు అమ్ముకున్నాడని పలువురు ఆరోపించారు. సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం అడ్డుకుంటామంటూ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. పార్టీ గ్రామ అధ్యక్ష పదవిని కూడా రూ.8 లక్షలకు బేరం పెట్టి, తమకు తెలియకుండా వేరొకరికి కట్టబెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదవులు అమ్మకం
పార్టీలో తమకు ప్రాధాన్యత లేకుండా, కష్టపడిన వారికి పదవులు ఇవ్వకుండా ఇష్టారీతిగా అమ్ముకుంటే పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటని మాజీ సర్పంచ్ శేషగిరిరావు, సొసైటీ మాజీ చైర్మన్ దండమూడి సాంబశివరావు తదితరులు మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, ఎంపీ పెమ్మసాని సోదరుడు రవి సమక్షంలో ఎమ్మెల్యే కార్యాలయంలో జరుగుతున్న వైఖరిపై తెలియజేశామని పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యేతో మాట్లాడితే తాను వచ్చి నచ్చ చెబుతానని దాటవేశాడని ఆరోపించారు.తాత్కాలికంగా ప్రమాణ స్వీకారం వాయిదా వేయమని చెప్పినా ముందుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై కేసులు పెట్టి జైలుకు పంపించిన కుటుంబానికి పార్టీ పదవులు అమ్ముకోవడం సిగ్గుచేటుగా ఉందని, పార్టీని నమ్ముకున్న తమకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.
ఫలించని చర్చలు
ఎమ్మెల్యే కార్యాలయం నుంచి రాజీ నిమిత్తం వచ్చిన జిల్లా అధికార ప్రతినిధి గుంటుపల్లి మధుసూదనరావు సముదాయించేందుకు యత్నించినా ససేమిరా అనడంతో ప్రమాణ స్వీకారం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఎమ్మెల్యే సమక్షంలో చర్చలు జరిపిన అనంతరం తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. నిరసనలో పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మానుకొండ శివరామకృష్ణ, నేతలు దండమూడి వెంకట్రావు, నిమ్మగడ్డ జానకీ రామయ్య, పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు