
‘పండుటాకు’పై ప్రతాపం
వారసుల భౌతిక దాడి ఇంటిని కబ్జా చేసి వెళ్లగొట్టారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీ ఇచ్చిన 84 ఏళ్ల వృద్ధురాలు
తెనాలి: వృద్ధులను ఆదరంగా చూసు కోవాల్సిన వారసులు బాధ్యతలను మరిచిపోతున్నారు. మనుషుల కన్నా ఆస్తుల పైనే మమకారం పెంచుకుంటున్నారు. పండుటాకులపై ప్రతాపం చూపిస్తున్నారు. ఇంట్లోంచి వెళ్లగొట్టేందుక్కూడా వెనుకాడటం లేదు. పట్టణంలోని శాంతీనగర్‌కు చెందిన చిలుకూరి వెంకటమ్మ (84)ఇందుకో నిదర్శనం. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయానికి సోమవారం వచ్చిన ఆమె తన కష్టాలను పరిపాలన అధికారి శ్రీధర్‌బాబుకు ఏకరువు పెట్టారు. లిఖితపూర్వక వినతిపత్రాన్ని అందజేశారు. ఆ ప్రకారం వివరాలిలా ఉన్నాయి. స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేషను పరిధిలోని శాంతినగర్‌లో వెంకటమ్మకు పక్కా ఇల్లు ఉంది. భర్త ఎప్పుడో చనిపోయారు. ఆమె కుమారుడు చిలుకూరి రామయ్య, మంగమ్మకు ముగ్గురు సంతానం. అనారోగ్యంతో భార్యాభర్తలు కాలం చేశారు. మనవరాళ్లు ఇద్దరు, ఒక మనవడు ఉన్నారు. ముగ్గురిలో లలిత అనే మనవరాలు నన్‌గా మారి ఇటలీలో ఉంటోంది. మనవడు చిలుకూరి రాజేష్‌బాబు ఎనిమిదేళ్ల క్రితం చిలకలూరిపేటకు చెందిన శాంతకుమారిని వివాహం చేసుకున్నాడు. ఎమ్మెస్సీ చేసిన శాంతకుమారి, గతంలో చిలకలూరిపేట, హైదరాబాద్‌లో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం తెనాలిలోనే ఓ కార్పొరేట్ పాఠశాలలో పని చేస్తున్నారు. వెంకటమ్మకు గల ఇంకో మనవరాలు అమల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పూర్తిగా మంచానికే పరిమితమైన ఆమె సంరక్షణ బాధ్యతను తల్లిదండ్రులు లేని కారణంగా నాయనమ్మ అయిన వెంకటమ్మ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల చిలకలూరిపేట నుంచి వచ్చిన తల్లి శారదతో కలసి శాంతకుమారి దౌర్జన్యంగా తన ఇంట్లోకి చొరబడినట్టు వెంకటమ్మ ఆరోపించింది. అంతేకాకుండా తనను కొట్టి, తనను, మనవరాలిని బయటకు వెళ్లగొట్టినట్టు ఆరోపించారు. సొంత ఇంటిని కబ్జా చేసి, వృద్ధురాలినైన తనను గెంటేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆశ్రయించినట్టు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవోకు మొరపెట్టుకున్నారు. తనకు తగిన న్యాయం చేసి, ఇల్లు ఇప్పించాలని వేడుకున్నారు.