
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తాడికొండ: అమరావతిలోని వేంకటపాలెంలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. లోక కల్యాణార్థం మొదటిసారిగా ఆలయంలో పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం అర్చకులు విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విక్ వరణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించారు. 19వ తేదీ ఉదయం పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట అధివాసం, సర్వదైవత్య హోమం చేపడుతారు. 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమాలు, స్నపన తిరుమంజ నం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. 21వ తేదీ ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపట్టనున్నారు. కార్యక్రమంలో టీటీడీ సూపరింటెండెంట్ ఎం.మల్లికార్జున, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ఏ. రామకృష్ణ, ఎం.సందీప్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.