
మరాఠా సంఘం రాష్ట్రస్థాయి సమావేశం
గుంటూరు మెడికల్: మరాఠా రాష్ట్ర సంఘం –ఆంధ్ర ప్రదేశ్ రిజిస్టర్డ్ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం గుంటూరు అరండల్‌పేటలో జరిగింది. సమావేశంలో సంఘం లక్ష్యాలు, గత ఏడాది కాలంలో చేసిన పనులు గురించి చర్చించారు. మరాఠా రాష్ట్ర సంఘం ఏపీ శాఖ అధికారిక చిహ్నం(లోగో)ను సంఘం గౌరవ అధ్యక్షుడు గంగాధరరావు తెన్నేటి ఆవిష్కరించారు. మరాఠాల వివాహ సంబంధాల విషయంలో ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యను సంఘం గమనించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మరాఠా కల్యాణం.కామ్ వెబ్‌సైట్‌ను సంఘం కార్యనిర్వహక అధ్యక్షుడు సింధే రవిచంద్రరావు, ఉపాధ్యక్షుడు కదం శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అన్ని భాషలలో రూపొందించిన ఈ వెబ్‌సైట్ సేవలు దేశంలోని మరాఠాలు అందరూ ఉచితంగా పొందవచ్చునని మరాఠా రాష్ట్ర సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మరాఠా వెంకట్ సోమాజీ తెలిపారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు వెంకటేశ్వరరావు డుమ్నే, ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌రావు మోతే, సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లోజి జాదవ్, సెక్రెటరీ హరినాథ్‌రావు జాదవ్, జాయింట్ సెక్రటరీ శంకరరావు మోరే, ఉప కోశాధికారి కదం రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.