
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
లక్ష్మీపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్ డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేట 4వ లైను కూడలి వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదివారం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కూటమి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ జీఓ నంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.2వేలు, మెస్ బిల్లులు పెంచాలని, హాస్టళ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, సొంత భవనాలను నిర్మించాలన్నారు. ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేస్తున్న జీఓ నంబరు 42, 35లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, అలాగే మండలానికి ఒక ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్, నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు షేక్ సమీర్, జిల్లా సహాయక కార్యదర్శులు పవన్ రూపస్, నగర అధ్యక్ష, కార్యదర్శులు సౌమ్య యశ్వంత్, నగర ఉపాధ్యక్షులు హర్షిత గంగాధర్, సహాయ కార్యదర్శులు సంతోష్, సుభాని, శశాంక్, సుర్జిత్, నగర బాలికల కన్వీనర్ సింధు శ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా