గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి నియామకం కోసం ఆసక్తి, అర్హత కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులు ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆదివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేసిన విధి, విధానాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లు (ఫిజికల్ ఎడ్యుకేషన్) పూర్తి వివరాలతోపాటు నమూనా దరఖాస్తును డీఈవో గుంటూరు బ్లాగ్‌స్పాట్.కామ్ సైట్‌లో సందర్శించాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంతో అందజేయాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
తెనాలిరూరల్: తెనాలి సుల్తానాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. అంగలకుదురులో కిరాణా షాపు నిర్వహించే పువ్వాడ సుబ్బారావు(72) రోడ్డుపై నడుచుకుంటూ తెనాలి నుంచి అంగలకుదురు వైపు వెళ్తుండగా గుర్తు తెలియని కారు వేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో సుబ్బారావు తీవ్రంగా గాయపడగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. త్రీ టౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.