
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక వెసులుబాటు
రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి టౌన్: సీ్త్ర శక్తి పథకంతో రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రినాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా సీ్త్ర శక్తి పథకాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చని తెలిపారు. సెప్టెంబర్‌లో మూడు వేల ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెనాలి డిపో నుంచి రోజుకు 17వేల మంది మహిళలు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్నట్లు తెలియజేశారు. మహిళలు ఏదైనా ఐడీ కార్డు చూపిస్తే కండక్టర్ జీరో టికెట్ కొడతారని వెల్లడించారు. ప్రభుత్వం నిద్దేశించిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ, ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన సూచించారు. తెనాలి నుంచి నందివెలుగు వరకు మహిళలతో విజయవాడ బస్సులో మంత్రి మనోహర్ ప్రయాణించారు. నందివెలుగు స్టాప్ వద్ద పల్లెవెలుగు బస్సులను ఆయన పరిశీలించారు. జీరో టికెట్ కొట్టారో లేదో బస్సులోని మహిళా ప్రయాణికులను ఆయన అడిగారు. తెనాలి బస్టాండ్ నుంచి విజయవాడకు తాము తీసుకున్న టికెట్‌కు డబ్బు చెల్లించామని మహిళలు చెప్పారు. దీంతో మంత్రి కండెక్టర్‌ను ప్రశ్నించగా, తమకు ఉన్నతాధికారులు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదని బదులిచ్చారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎ.రాజశేఖర్, తహసీల్దార్ కె.వి.గోపాలకృష్ణ, మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ వి.ఎం.లక్ష్మీపతిరావు, హెల్త్ ఆఫీసర్ మువ్వా ఏసుబాబు, పలువురు ఆర్టీసీ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.