
వైభవంగా స్వాతంత్య్ర వేడుకలు
గుంటూరు వెస్ట్: స్వాతంత్య్ర దినోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. మంగళవారం స్థానిక డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఈ వేడుకలు స్థానిక పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అతిథులకు సీటింగ్‌తోపాటు, ఆహుతులు కూర్చునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకునేవిధంగా ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతిభింబించే విధంగా శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. స్టాల్స్‌లో ప్రజలు కొనుగోలు చేసేవిధంగా ఉత్పత్తులను సరిపడా ఉంచాలన్నారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం గడ్డిపాడు రైల్వే గేటు నుంచి తొమ్మిది అడుగులు వెడల్పు, పది కిలో మీటర్ల పొడవు ఉన్న జాతీయ జెండాతో ర్యాలీ చేపడతామన్నారు. రాలీలో అందరూ పాల్గొనే విధంగా చూడాలన్నారు. డీఆర్‌ఓ షేక్ ఖాజావలి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ గంగరాజు, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతు, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ