వైఎస్సార్ సీపీ నేత మోదుగుల వేణుగోపాలరెడ్డి ధ్వజం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు జేబు సంస్థగా పనిచేస్తోందని వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. గుంటూరులో పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎన్నికల సరళిలో టీఎన్ శేషన్ ఎంతటి శక్తివంతమైన చర్యలు తీసుకువచ్చారో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ చేతిలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రంలోని ఎస్‌ఈసీ చంద్రబాబు జేబు సంస్థగా పనిచేస్తున్నాయన్నారు. వైఎస్సార్ సీపీని మానసికంగా బలహీనపరిచేందుకు కూటమి ప్రయ త్నిస్తోందన్నారు. ఈవీఎంలతో చంద్రబాబు గెలిచాడనే భావన ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. పులివెందులతో జడ్పీటీసీ ఎన్నికలకు గెలిచి సాధించేంది ఏముందీ.. అని ప్రశ్నించారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా వ్యవహరిస్తే మీరు పోటీ చేసే వారా అని ప్రశ్నించారు. పులివెందుల ఎన్నికల రభసలో రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎన్నికల కమిషన్‌దే తప్పని స్పష్టం చేశారు. తొత్తుల్లా పని చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా, ఇప్పటికే హెచ్చరించారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసుతో ఓటు గెలుచుకోవాలి గానీ, భయపెట్టి కాదని హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కచ్ఛితంగా అధికారంలో వస్తుందని, ఇప్పుడు తొత్తులుగా పనిచేసిన వారందరికీ గుణపాఠం తప్పక చెప్తామన్నారు.