
రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా రమేష్ బాబు
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల కేంద్ర సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం ఆదివారం గుంటూరులోని ఏపీ ఎన్‌జీఓ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి 13 ఉమ్మడి జిల్లాల నుంచి ప్రభుత్వ డ్రైవర్లు హాజరయ్యారు. కేంద్ర సంఘ అధ్యక్షుడిగా ఉన్న సంసాని శ్రీనివాసరావు పై వచ్చిన అనేక ఆరోపణలు, అవినీతి కార్యకలాపాలపై చర్చించారు. రాష్ట్రంలో ఉన్న సభ్యుల సమస్యలు పరిష్కారం చేయనందున అవిశ్వాసం ప్రకటించి శ్రీనివాసరావును సంఘ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘ అధ్యక్షుడిగా పి. రమేష్ బాబును నియమిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంసాని శ్రీనివాసరావుకి ప్రభుత్వం కల్పించిన ఓడీ సదుపాయాన్ని రద్దు చేయాలని కోరుతూ తీర్మానించారు. రమేష్ బాబును గుంటూరు జిల్లా ఏపీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు , స్టేట్. వైస్ ప్రెసిడెంట్. షేక్ నాగూర్ షరీఫ్, సిటీ అధ్యక్షుడు సూరి, ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్ కాన్ఫిడేషన్ జాతీయ అధ్యక్షుడు వై నాగేశ్వరరావు తదితరులు అభినందించారు.