
రైల్వే శాఖలో శ రవేగంగా అభివృద్ధి
తెనాలి టౌన్: దేశంలోని విమానాశ్రయాలకు దీటుగా రైల్వే శాఖను శ రవేగంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధాని పనిచేస్తున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం తెనాలి రైల్వే స్టేషన్‌ను ఆయన సందర్శించారు. స్టేషన్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా తెనాలి రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు రూ.27 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. ముందుగా ఒకటో ప్లాట్‌ఫాంపై పనులను పరిశీలించారు. ప్రయాణికులను అడిగి స్టేషన్‌లో సౌకర్యాలు ఆరా తీశారు. నూతనంగా వేసిన టైల్స్ నాసిరకంగా ఉండటాన్ని గుర్తించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. రూ.12 కోట్ల నిధులతో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్స్, 3 లిఫ్ట్‌లు, ఆరు ఎస్కలేటర్ల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 25వ తేదీ నాటికి పనులు పూర్తి కావాలని ఆదేశించారు.
రైళ్లకు స్టాప్ కోసం ప్రయత్నాలు
పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు గుంటూరు నుంచి తెనాలి వరకు ఎక్స్‌టెన్షన్ చేపట్టే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. సంగమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తెనాలి స్టాప్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సికింద్రాబాద్, తిరుపతి మధ్య వందే భారత్ రైలుకు కూడా తెనాలిలో స్టాప్ అడుగుతున్నట్లు చెప్పారు. రైల్వే మంత్రితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్టేషన్ ముందు తూర్పు భాగంలో మరిన్ని ఆధునికీకరణ పనులు చేయాల్సి ఉందని వివరించారు. వెహికల్ పార్కింగ్‌కు అనువుగా పనులు చేపడతామని తెలిపారు. పనుల నాణ్యతలో రాజీపడేది లేదని అన్నారు. కొన్ని డిజైన్లు మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్టేషన్ పరిసరాల్లో గంజాయి బ్యాచ్ తిరుగుతున్నట్లు కొందరు మంత్రి దృష్టికి తీసుకురాగా.. చర్యలు తీసుకోవాలని ఆర్‌పీఎఫ్ సీఐను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, సెంట్రల్ సీనియర్ డివిజనల్ ఇంజినీర్ కె.వెంకటేశ్వరరావు, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అడిషనల్ జనరల్ మేనేజర్ ఎస్‌ఏకే బాషా, బాపట్ల ఏడీఈఎన్ కె.శ్రీనివాసరావు, సీపీడబ్ల్యూఐ – తెనాలి జి.కిరణ్‌బాబు, స్టేషన్ మేనేజర్ టి.వెంకటరమణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర సహాయ మంత్రి
పెమ్మసాని చంద్రశేఖర్