
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి
జె.పంగులూరు: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అలవలపాడు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. రేణింగవరం పోలీసులు అందించిన వివరాల మేరకు.. ఇంకొల్లు మండలం హనుమోజీ పాలేనికి చెందిన అత్తులూరి ధనుంజయరావు (45) భార్య మహోన్నతితో కలిసి గ్రామం నుంచి మోటార్ సైకిల్‌పై కొరిశపాడు మండలం బొడ్డువాని పాలెం గ్రామంలో బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరిగి జాతీయ రహదారి వెంబడి హనుమోజిపాలెం బయలు దేరారు. అలవలపాడు వద్ద క్రాస్ రోడ్డు దాటుతుండగా, గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో బైక్‌పై వెళుతున్న దంపతులు కింద పడ్డారు. తీవ్రగాయాలపాలైన ధనుంజయరావు అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు గాయలు కాగా ఒంగోలు వైద్యశాలకు తరలించారు. మృతుడు చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునికి పనిచేస్తున్నారు. సంఘటనపై ఎస్సై వినోద్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.