
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
సంతమాగులూరు (అద్దంకి): భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటనలో ఆమెను వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది. ఈ దారుణం సంతమాగులూరు మండలం ఏల్చూరులో శుక్రవారం రాత్రి జరగ్గా.. శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన సల్లూరి సుబ్బమ్మ, మేరిబాబుకు ముగ్గురు సంతానం. ఆమె తన భర్తతో గొడవల కారణంగా పదేళ్ల నుంచి విడిపోయి అదే గ్రామంలోని తన అన్న గేరా ఆంజనేయులు ఇంటి వద్ద తన ముగ్గురు పిల్లలతోపాటు నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమార్తె కృష్ణకుమారిని, వారం రోజుల కిందట చీమకుర్తి మండలంలోని మంచికలపాడుకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసింది. తన ఇద్దరు అబ్బాయిల్లో సల్లూరి రవీంద్రబాబు తొమ్మిదో తరగతి, సల్లూరి నాగాంజనేయులు ఆరో తరగతి చదువుతున్నారు. వీరిరువురు అద్దంకిలోని ఎస్సీ హాస్టల్లో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో సల్లూరి సుబ్బమ్మ (35), చిన్న కుమారుడు నాగాంజనేయులు తమ ఇంటి బయట అన్నం తింటున్నారు. భర్త మేరీబాబు వచ్చి ఆమెతో గొడవ పెట్టుకుని కత్తితో తల మీద నరికాడు. ఆమె కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చేసరికి అతను అక్కడ నుంచి పారిపోరయాడు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు నాగాంజనేయులు తన మామయ్య గేరా ఆంజనేయులుకు సమాచారం అందించాడు. క్షతగాత్రురాలిని 108 అంబులెన్స్‌లో నరసరావుపేటలోని మహాత్మాగాంధీ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలలో ఉంచారు. మేరీబాబు తన భార్యతో విడిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఆమె వద్దకు మందు తాగి వెళ్లి ఆమైపె అనుమానంతో ఘర్షణ పడుతుండేవాడని తెలుస్తోంది.
వైద్యశాలకు తరలిస్తుండగా మృతి