
కూటమి ప్రభుత్వ దగాతో సాగుకు అన్నదాతల వెనుకడుగు
కృష్ణమ్మ నీరు అందుబాటులో ఉన్నా రైతుల్లో నిర్లిప్తత నెలకొంది. నాగార్జునసాగర్, పులిచింతల, శ్రీశైలం జలాశయాలు పూర్తిగా నిండినా.. సాగుపై ఆసక్తి చూపడం లేదు. అన్నదాతలు అయోమయంలో కూరుకుపోయారు. పెట్టుబడులు భారీగా పెరగడంతోపాటు దాదాపు ఏ పంట వేసినా కూటమి ప్రభుత్వం వచ్చాక గిట్టుబాటు ధరలేక భారీ నష్టాలు తప్పకపోవడమే ఈ దుస్థితి కారణం.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో గత ఏడాది కంటే ప్రస్తుతం 5,390 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు తగ్గుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 93,924 హెక్టార్లుగా ఉంది. ఇప్పుడు 88,534 హెక్టార్లకే పరిమితం కానుంది. గత ఏడాది ఈ సమయానికి 82,292 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఇప్పుడు కేవలం 37,204 హెక్టార్లలోనే పంటలు వేశారు. ఒక్క కొల్లిపర మండలం తప్ప ఏ మండలంలోనూ సాగు ఆశాజనకంగా లేదు. ఉద్యాన పంటల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.
ఇదీ పంటల పరిస్థితి...
● వరి విషయానికి వస్తే గత ఏడాది 63,733 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా.. ఆగస్టు మొదటి వారానికి 56,789 హెక్టార్లలో పంట వేశారు. అదే ఈ ఏడాది చూస్తే 61,257 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేయగా... ఇప్పటి వరకు 29 వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది. అంటే 47 శాతం మాత్రమే పంట వేశారు.
● జిల్లాలో 3,061 హెక్టార్లలో కందులు, మినుములు, పెసర, శనగలు వేస్తారని అంచనా వేశారు. కేవలం 324 హెక్టార్లలోనే సాగు చేశారు. అది కూడా 319 హెక్టార్లలో మినుములు వేశారు.
● పత్తి విస్తీర్ణం కూడా గణనీయంగా పడిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి 21,842 హెక్టార్లలో సాగు చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 7,715 హెక్టార్లలో మాత్రమే సాగైంది.
ఏ పంట వేసినా కన్నీరే
గత ఏడాది వరితోపాటు మిర్చి, పొగాకు, పత్తి, పసుపు, కందులు... ఇలా ఏ పంట వేసినా కూటమి సర్కార్ తీరుతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి రైతులు దాదాపు ఎకరానికి రూ.లక్షకుపైగా నష్టపోతే, మిగిలిన పంటలు వేసిన వారికీ భారీగా నష్టం తప్పలేదు. వరి కొతకు వచ్చే సమయానికి భారీ వర్షాలకు పంటలు తడిచిపోగా, ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టింది. వ్యాపారులు ధరలు తగ్గించేసి రైతులను దోచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పంటలు వేయడానికి రైతులు సాహసించని పరిస్థితులు నెలకొన్నాయి.
‘రియల్ వ్యాపారి’గా ప్రభుత్వం
మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయి. ప్రభుత్వం సమీకరించిన భూమి వేల ఎకరాలు ఉంది. ఈ నేపథ్యంలో తుళ్లూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు రూరల్, వట్టిచెరుకూరు, పెదకాకాని మండలాల్లో చాలా మంది రైతులు వ్యవసాయం నుంచి దూరంగా వెళ్లిపోయారు. తమ పొలాలను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో గుంటూరు జిల్లాలో పంటల విస్తీర్ణం గణనీయంగా పడిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు
సాధారణ విస్తీర్ణం వివరాలు
జిల్లాలో భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం 5,390 హెక్టార్ల వరకు తగ్గొచ్చని వ్యవసాయ శాఖ అంచనా అందుబాటులో నీరున్నా పంట వేయడానికి ఆసక్తి చూపని రైతన్నలు గత ఏడాది ఇప్పటికే 89 శాతం పంటలు ప్రస్తుతం 47 శాతమే సాగు చేసిన వైనం ఏ పంట వేసినా తప్పని భారీ నష్టాలతో కర్షకులకు గడ్డుకాలం కూటమి సర్కార్ మోసపూరిత వైఖరిపై తీవ్ర ఆగ్రహం
పంట రకం సాధారణ విస్తీర్ణం
(హెక్టార్లలో)
వరి 63,000
పత్తి 24,000
పసుపు 4,000
పండ్ల తోటలు 3,590
మినుము 3,122
కూరగాయలు 1,947
పూల తోటలు 437
నువ్వులు 28
జూట్ 20
చెరకు 10
మొత్తం 1.15 లక్షలు