గుంటూరు మెడికల్: తాను మరణిస్తూ అవయవదానంతో మరో ఐదుగురికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. ఇంటి పెద్ద చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న కుటుంబ సభ్యులు పెద్ద మనస్సు చేసుకుని అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. అవయవదానం చేసి న కుటుంబ సభ్యులను ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సత్కరించారు. వివరాల్లోకి వెళితే... బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామానికి చెందిన కనగాల బాల రామకృష్ణ (59) ఐదేళ్లుగా గుంటూరు కృష్ణనగర్‌లో నివసిస్తున్నారు. ఆగస్టు 3న గుంటూరు గుజ్జనగుండ్ల నుంచి పట్టాభిపురం వైపు సైకిల్‌పై వెళుతున్నాడు. కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌కు తరలించారు. అత్యవసర చికిత్స పొందుతూ ఈనెల 7న బ్రెయిన్ డెడ్ గా నిర్దారించి, చికిత్స అందిస్తున్న న్యూరాలజీ చీఫ్ డాక్టర్ కుమారవేల్ విషయాన్ని కుటుంబసభ్యులకు విషయం తెలిపారు.
బాలరామకృష్ణ కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వారు జీవన్‌ధాన్ గురించి తెలియజేయడంతో, అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు గురువారం ఆపరేషన్ చేసి బాలరామకృష్ణ శరీర అవయవాలను ఇతరులకు అమర్చి నూతన జీవితాలను ప్రసాదించారు. గుంటూరు రమేష్ హాస్పటల్‌లో లివర్, కిడ్నీ సమస్యలతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇరువురు రోగులకు బాలరామకృష్ణ శరీర అవయవాలను ఆపరేషన్ ద్వారా అమర్చి ఇరువురికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. మరో కిడ్నీ, రెండు నేత్రాలను విజయవాడ విజయ్ హాస్పటల్, తాడిగడప ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించి, అక్కడ చికిత్స పొందుతున్న వారికి అమర్చి నూతన జీవితాన్ని ప్రసాదించారు.
సూపరింటెండెంట్ అభినందన
జీవన్‌దాన్ ట్రస్ట్ తరుపున గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ గురువారం బాలరామకృష్ణ కుటుంబ సభ్యలను పరామర్శించి అభినందించారు. త్వరలో ప్రభుత్వం అవయవదానం చేసిన వారిని గుర్తించి తగినవిధంగా సహకరిస్తుందని వెల్లడించారు. జీవన్‌ధాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 10 వేలు కుటుంసభ్యులకు అందించారు. ఆష్టర్ రమేష్ హాస్పటల్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత మాట్లాడుతూ విషాద సమయంలో కూడా ఆ కుటుంబం తీసుకున్న అవయవదాన నిర్ణయం, నిజంగా విలక్షణమైన మానవీయ చింతనకు ప్రతిబింబమన్నారు.
అంతర్జాతీయ సదస్సులో గుర్తింపు అభినందనీయం
పెదకాకాని(ఏఎన్‌యూ): అంతర్జాతీయ సదస్సులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ హిందీ విభాగ సహాయ సమన్వయకర్త డాక్టర్ కె.శ్రీకృష్ణ పురస్కారం పొందడం అభినందనీయమని యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. పంజాబీ సభ మాస్కో(రష్యా), నేపాల్ సంస్కృత విద్యాలయ వాల్మీకీ విద్యాపీఠం(నేపాల్ రాజధాని ఖాట్మండ్) సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ కె.శ్రీకృష్ణకు విద్యాశ్రీ సమ్మాన్ 2025 పురస్కారం లభించింది. గురువారం వీసీ ఆచార్య కె.గంగాధరరావు తన ఛాంబర్‌లో డాక్టర్ శ్రీకృష్ణను అభినందించారు. వీసీ మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సులో శ్రీకృష్ణ సమర్పించిన పరిశోధన పత్రానికి మంచి గుర్తింపు రావడం అభినందనీయమన్నారు.

అవయవదానంతో ఐదుగురికి నూతన జీవితం