
రాజధానిలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామాల్లో రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉందని, రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోతే ఉద్యమాలు తప్పవని వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్) అన్నారు. గురువారం రాత్రి రాజధాని గ్రామం పెనుమాకలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. వేమారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రాజధాని ప్రాంతంలో ఫూలింగ్‌కు పొలాలను ఇచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో ప్లాట్లు కేటాయించలేదని, ప్లాట్లు కేటాయించని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో పలురకాల వాణిజ్య పంటలు పండించుకుంటూ వారి పిల్లల భవిష్యత్తు గురించి కలలు కన్నారని, గతంలో అధికారంలో ఉన్న టీడీపీ రాజధాని పేరుతో పంటలు పండించే భూములను నాశనం చేసి, రైతులను బెదిరించి ల్యాండ్ ఫూలింగ్ కింద భూములు తీసుకున్నారని అన్నారు. ఆ భూ ములకు సంబంధించి ఎలాంటి ప్లాట్లు పూర్తి స్థాయిలో రైతులకు కేటాయించలేదన్నారు. మూడు సంవత్సరాల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తరువాత, మళ్లి అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం అయినా ఒక్క ప్లాట్‌ను కూడా తట్టి మట్టి వేయలేదు. రైతులు వారి పొలాలకు ధరలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇచ్చిన పంట పొలాలే అభివృద్ధికి నోచుకోలేదు. మరో 40 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే రైతులు స్థలాలకు ధరలు లేక, ఇబ్బంది పడుతున్నారు. రాజధానిలో కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా భూములు ఇచ్చి, వారి వద్ద నుంచి భారీగా ముడుపులు తీసుకుని రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మరో రైతు ఉద్యమం చేయబోతున్నామని, దానికి రైతులందరూ కలిసి కట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈప్రాంతాల్లో కొంత మంది రాజధాని పేరుతో రైతులను బెదిరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మంగళగిరి నియోజకవర్గంలో ఆనవాయితీ లేదని, బెదిరించే వారికి వైఎస్సార్‌సీపీ తరుపున హెచ్చరిక జారీ చేస్తున్నామని, భవిష్యత్‌లో వారు ఎక్కడ ఉన్నా వారి సంగతి తేలుస్తామన్నారు. చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదన్నారు.
గతంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
పూలింగ్‌కు పొలాలిచ్చిన రైతులకు వెంటనే ప్లాట్లు కేటాయించాలి
రెతులను ఇబ్బంది పెట్టవద్దు
వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి