
నీరజ్ చోప్రాను ఆదర్శంగా తీసుకోవాలి
గుంటూరు వెస్ట్ (క్రీడ లు): ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న నీరజ్ చోప్రాను అథ్లెట్స్ ఆదర్శంగా తీసుకోవాలని అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా చైర్మన్, సీనియర్ అథ్లెట్ జి.శేషయ్య తెలిపారు. గురువారం స్థానిక బీఆర్ స్టేడియంలో జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి అండర్–14, 16, 18, 20 బాల బాలికలతోపాటు యువతీ యువకుల జావెలిన్ త్రో పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. శేషయ్య మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించనందుకుగాను భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్ట్ 7న జాతీయ జావెలిన్ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన నీరజ్ చోప్రా విజయ రహస్యాలను అథ్లెట్స్ సాధన చేయాలన్నారు. అనంత రం శేషయ్య, జిల్లా కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కోచ్ రవి, కె.రాజు, సుబ్రమణ్యం, చిన్న, నాని పాల్గొన్నారు.
అద్దె చెల్లించలేదని మహిళపై దాడి
తాడేపల్లిరూరల్: స్థానిక ఇప్పటంలో అద్దె చెల్లించే విషయంలో ఆలస్యం కావడంతో జనసేన నాయకుడి తమ్ముడు ఓ మహిళపై దాడిచేసిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ ఖాజా వలి కథనం ప్రకారం.. కుంచనపల్లిలో నివాసముండే అమ్మిశెట్టి సురేష్ అనే యువకుడు తనకున్న నివాసాన్ని హాస్టల్ నిర్వహించుకునేందుకు అదే గ్రామానికి చెందిన శ్రీలత అనే మహిళకు అద్దెకు ఇచ్చాడు. నెలకు రూ. 50 వేలు అద్దె చెల్లించాల్సి ఉండగా శ్రీలత రూ. 30 వేలు ఇచ్చిందని, రూ. 20 వేలు చెల్లించే విషయంలో సురేష్‌కు, శ్రీలతకు రెండు మూడుసార్లు చిన్నపాటి వాదనలు జరిగాయి. బుధవారం రాత్రి శ్రీలత ఇప్పటంలో ఉన్నానని, రూ. 20 వేలు ఇస్తానని చెప్పింది. ఇదే విషయమై సురేష్ మరో ఇద్దరితో కలసి ఇప్పటం వెళ్లి వాదనకు దిగాడు. అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో శ్రీలతపై సురేష్ తో పాటు మరో ఇద్దరు దాడి చేశారు. ఈ విషయమై శ్రీలత పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. ఇదిలా ఉంటే అమ్మిశెట్టి సురేష్ అన్నయ్య జనసేన నాయకుడు కావడంతో శ్రీలతను కేసు విత్‌డ్రా చేసుకోమని ఒత్తిడి తీసుకువస్తున్నారు. తమపై ఎటువంటి ఒత్తిడి తెచ్చినా మంత్రి లోకేష్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని వారి బంధువులు వెల్లడించారు.