
నా బిడ్డను అన్యాయంగా తీసుకెళ్లారయ్యా
పట్నంబజారు: అర్ధరాత్రి .. రెండు గంటల సమయం.. పోలీసులు ఇంటి గోడలు దూకి దబదబా తలుపులు కొట్టారు.. దూకుడుగా ఇంట్లోకి ప్రవేశించి బీటెక్ చదువుతున్న విద్యార్థిని కాలర్ పట్టుకుని లాక్కుని బయటకు వెళ్లారు.... ఆపైన చోరీ చేసినట్లుగా ఇళ్లంతా వెతికారు.. ఇదంతా బయటి వ్యక్తులు చేసిన పని కాదు.. సాక్షాత్తు పోలీసులు వ్యవహరించిన తీరిది. దీనిపై విద్యార్థి తండ్రి దేవరకొండ మల్లి వివరాలు ‘సాక్షి’కి వివరించారు. ఓబులనాయుడుపాలెంలో నివాసం ఉండే దేవరకొండ మల్లి తహసీల్దారు కార్యాలయంలో పనిచేస్తున్నాడు. అతని కుమారుడు రాజమనోహర్ బీటెక్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులమంటూ రెండు జీవుల్లో వచ్చిన పోలీసులు బలవంతంగా విద్యార్థి రాజ మనోహర్‌ను లాక్కొని వెళ్లారు. కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ వారిని పక్కకు నెట్టి విద్యార్థిని తీసుకెళ్లారు. లాలాపేట పోలీసు స్టేషన్ అని చెప్పి తీసుకెళ్లినట్లు తెలిసింది. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు లాలాపేట పోలీసు స్టేషన్‌కు వెళ్లగా, తాము ఎవరిని తీసుకు రాలేదని తెలిపారు. కొత్తపేట పోలీసు తీసుకెళ్లినట్లు ధృవీకరించారు. పలుమార్లు పోలీసులు కొత్తపేట, లాలాపేట అంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులను తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 10 గంటల వరకు తిప్పినట్లు బాధితులు వాపోయారు. తన కుమారుడిని ఏ కేసులో తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారనే అంశంపై ఎలాంటి వివరణ తమకు చెప్పలేదన్నారు. తమ కుమారుడు హ్యాకింగ్ చేశాడని చెబుతున్నారని, తన కుమారుడు అలాంటి వాడు కాదని చెప్పారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక ప్రజాప్రతినిధి గురించి పెద్దఎత్తున హల్‌చల్ అయిన విషయం విదితమే. ఈక్రమంలో ఆ కేసులో విద్యార్థి పోస్టింగ్ పెట్టాడనే నెపంతో తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. సదరు విద్యార్థి పోస్టింగ్ పెట్టాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై కొత్తపేట పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం.వీరయ్య చౌదరిని వివరణ కోరగా, కేసు విచారణలో ఉందని, మీడియాకు వివరాలు వెల్లడించలేమని తెలిపారు.
పోలీసుల తీరుపై ఘొల్లుమన్న తండ్రి