
ఘర్ ఘర్ తిరంగాలో పాల్గొనండి
గుంటూరు మెడికల్: బీజేపీ గుంటూరు జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం మంగళవారం నగరంలోని శ్రీకన్వెన్షన్‌లో జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ మాట్లాడుతూ అమృత మహోత్సవ్ పేరుతో జాతీయ జెండా పట్టుకొని 13, 14, 15వ తేదీలలో ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతి రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయ ప్రకాష్ నారాయణలు మాట్లాడుతూ జిల్లా పార్టీలో సీనియర్ నేతలు, కార్యకర్తలు నేటికీ పార్టీని నడిపిస్తున్నారని చెప్పారు. పి.వి.ఎన్.మాధవ్ గుంటూరు పర్యటన సందర్భంగా మంగళవారం పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో చిల్లీస్ దాబా నుంచి శ్రీ కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీగా వచ్చి స్వాగతించారు. తీన్మార్ డప్పులు, గిరిజన సంప్రదాయ నత్యాలు, పార్టీ జెండాలతో సందడి చేశారు. ద్విచక్ర వాహనాల ర్యాలీ ఆకట్టుకుంది. జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అభివృద్ధికి సహకారం
మంగళవారం గుంటూరు నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలోనే గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం రూ.100 కోట్ల యూజీడీ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అమరావతి ఆయువుపట్టు అయిన ఓఆర్‌ఆర్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి రూ.10 వేల కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.