కదం తొక్కిన ఎండీయూ వాహనదారులు
గుంటూరు వెస్ట్: ఉపాధికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తమకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మోసం చేయడం దారుణమని ఎండీయూ వాహనదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక స్థంభాలగరువు నుంచి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అర్ధనగ్నంగా ఎండీయూ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాషా మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ను సంఘం రాష్ట్ర నాయకులు కలిసినప్పుడు ఉపాధికి ఎటువంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఇంతలోనే ఆ మాట తప్పారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వెయ్యి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. వాస్తవానికి తమ కాంట్రాక్ట్ 2027 జనవరి వరకు ఉందని, అప్పటి వరకు తమను కొనసాగించాలన్నారు. ప్రజాదరణ పొందిన ఎండీయూ వాహనాల వ్యవస్థ ద్వారా రేషన్ పంపిణీని తొలగించడానికి ఎటువంటి కారణాలు లేవన్నారు. రాజకీయాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే కర్తవ్యంగా భావిస్తామని చెప్పారు. ఉపాధి మార్గాలు చూపించాల్సిన ప్రభుత్వం ఇలా తమ నోటి దగ్గర కూడు లాగేయడం అన్యాయమని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు మరే పని చేతకాదని, కనీసం రెండేళ్లు సమయం ఇస్తే ఇతర మార్గాలు అన్వేషించుకుంటామని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ నాయకులు కె.డానీ, బి.తిరుపతి రామయ్య పాల్గొన్నారు. వాహనదారులకు ఆదిలోనే పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు 20 మంది పోలీసులు వచ్చి కదలనీయలేదు. స్థంబాలగరువులోనే అసోసియేషన్ నాయకులు ప్రసంగించి, కార్యక్రమాన్ని ముగించారు. తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని వాపోయారు.
కూటమి ప్రభుత్వ కుట్రపై పోరుబాట సర్కారు నమ్మించి మోసం చేసిందని ఆవేదన తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్


