మోహిని అలంకారంలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణంలోని శ్రీవారి ఆలయాల్లో కనుల పండుగగా ప్రత్యేక పూజలు, స్వామివారి అలంకరణలు చేపడుతున్నారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీవారు జగన్మో హనకారుడు మోహిని అలంకరణలో దర్శనమిచ్చారు. మహిళా మాతలతో కుంకుమ పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీవారిని దర్శించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు గోత్రనామాలతో కుంకుమ పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారిని శ్రీలక్ష్మీశ్రీనివాసుడిగా అలంకరించి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిలను తమలపాకులతో అలంకరించి పూజలు చేశారు. మహిళా మాతలు పాశురాలను పఠించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అచ్చంపేట: అచ్చంపేట మండలం తాడువాయి గ్రామ ఎస్టీ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున గొర్రెల స్థావరాలపై కుక్కలు దాడి చేశాయి. 32 గొర్రెలు మృతి చెందాయి. గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన కె.వెంకటేశ్వర్లు గొర్రెల పెంపకంపై జీవనం కొనసాగిస్తుంటారు. ఆయన తన ఇంటి పక్కనే ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో 60 గొర్రెలను ఉంచగా ఆదివారం తెల్లవారుజామున సుమారు మూడు, నాలుగు కుక్కలు దాడిచేశాయి. 32 గొర్రెలను గాయపరచగా అవి అక్కడికక్కడే మృతి చెందాయి. తమకు ఎలాంటి జీవనాధారం లేదని, గొర్రెల పంపకమే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నామంటూ బాధితుడు వెంకటేశ్వర్లు, అతని భార్య విలపించారు. ప్రభుత్వం స్పందించి తమకు పరిహారం ఇప్పించాలని వారు కోరుతున్నారు.
తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం స్వామివారిని శ్రీ కృష్ణావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి దేవత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.
మోహిని అలంకారంలో శ్రీవారు
మోహిని అలంకారంలో శ్రీవారు
మోహిని అలంకారంలో శ్రీవారు


