గ్రామాల విలీనంపై ‘సిండికేట్‌’గా తీర్మానం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల విలీనంపై ‘సిండికేట్‌’గా తీర్మానం

Dec 29 2025 8:02 AM | Updated on Dec 29 2025 8:02 AM

గ్రామాల విలీనంపై ‘సిండికేట్‌’గా తీర్మానం

గ్రామాల విలీనంపై ‘సిండికేట్‌’గా తీర్మానం

ఎమ్మెల్యే, మున్సిపల్‌ మేయర్‌, కమిషనర్లదే కీలక పాత్ర 2012లో విలీనమైన గ్రామాల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాల్లేవు స్వపక్షంలోని ఇతర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల నుంచీ వ్యతిరేకత కొత్తగా విలీనం చేస్తే స్థానికుల నుంచి వైఎస్సార్‌సీపీ సంతకాల సేకరణ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి, ఎమ్మెల్సీ చంద్రగిరి, పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్‌ బాల వజ్రబాబు

కనిపించని అభివృద్ధి

నగరంపాలెం: గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో గ్రామాలను విలీనం చేయడాన్ని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం బృందావన్‌ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా, డిప్యూటీ మేయర్‌ బాలవజ్రబాబు, పార్టీ కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ... జీఎంసీ పరిధిలోని గ్రామాలను విలీనం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించగా, జీఎంసీ అత్యవసర కౌన్సిల్‌ సమావేశంలోనే వ్యతిరేకించామని అన్నారు. అందుకు కారణాలను వివరంగా తెలియజేశామని చెప్పారు. 2012లో జీఎంసీలో విలీనమైన గ్రామాలు ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదని అన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారుల నిర్మాణం జరగలేదని ఆరోపించారు. కార్పొరేషన్‌లోకి 18 గ్రామాలను విలీనం చేయడం వల్ల ఆయా గ్రామాల్లోని ప్రజలకు ఒరిగేది ఏమి లేదని, కార్పొరేషన్‌కు ఆదాయం మినహా ప్రజలకు లాభం లేదని చెప్పారు. తమ నిర్ణయాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవిలు కూడా తీసుకున్నారని అన్నారు. గ్రామాల విలీనాన్ని విరమించకపోతే ఆయా గ్రామాల్లోని ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపడతామని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

ఇష్టానుసారం వ్యవహరించడం తగదు

ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసు రత్నం మాట్లాడుతూ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రతిపాదించిన 11 గ్రామాలు జీఎంసీలో విలీనాన్ని స్వపక్షంలోనే వ్యతిరేకించారని అన్నారు. గ్రామాల విలీనంపై ఏకపక్షంగా తీర్మానం చేయడం దుర్మార్గమని, ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికై న వారు ఇష్టానుసారంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. అభివృద్ధికి వైస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని, తమ ప్రభుత్వ హయాంలో గుంటూరు నగరానికి చుట్టు ఉన్న ప్రాంతాల్లో వేల మంది ప్రజలకు నివేశిత స్థలాలను పంపిణీ చేశారని గుర్తుచేశారు. జగనన్న స్థలాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్‌, డోర్‌ నంబర్లు, ఇతరత్రా సౌకర్యాలను కల్పిస్తే గుంటూరు నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తాడికొండ, పొన్నూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు తెలియకుండానే మరో ఏడు గ్రామాలను విలీనం చేశారని మండిపడ్డారు.

స్వార్థంగా ఆలోచిస్తున్న బూర్ల

జీఎంసీ డిప్యూటీ మేయర్‌ బాలవజ్రబాబు మాట్లాడుతూ కౌన్సిల్‌ సమావేశంలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. గ్రామాల విలీనాన్ని టీడీపీ గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 2012లో విలీనం చేసిన గ్రామాల్లో కనీస సౌకర్యాల్లేక అలాగే ఉన్నాయని ఆరోపించారు. జీఎంసీ పరిధిలోని అనేక వార్డుల్లో సమస్యలు తిష్ట వేశాయని, ఇవిగాక మరో 18 గ్రామాలను తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు 20 వేల ఎకరాల ల్యాండ్‌ వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే బూర్ల వ్యాపార కోణంలో చూస్తున్నారని, ప్రజా సమస్యలపై ఆయన ఆలోచన చేయడంలేదని మండిపడ్డారు. ఆఖరికి జీఎంసీ కౌన్సిల్‌ సమావేశానికి గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు నసీర్‌ అహ్మాద్‌, గళ్లా మాధవిలు హాజరుకాలేదని గుర్తుచేశారు. విలీన గ్రామాలకు ప్రజామోదం లేదని, స్వార్థం కోసం ఈ తీర్మానం చేశారని ఆరోపించారు. ఈ నెల 30వ తేదీలోగా గ్రామాల జాబితాను పంపించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల నిర్ణయం తీసుకుని హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. చాలా గ్రామాల్లో ప్రజలకు జీఎంసీలో విలీనం చేస్తున్నారనేది తెలియదని అన్నారు. మేయర్‌ కోవెలమూడి రవీంద్ర చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని హితవు పలికారు. బూర్లను తృప్తి పరిచే పనులు చేయవద్దని పేర్కొన్నారు. గుంటూరు పార్లమెంట్‌ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు పఠాన్‌ సైదాఖాన్‌, యువజన విభాగం అధ్యక్షుడు ఏటి కోటేశ్వరరావు, కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, బూసి రాజలత, పడాల సుబ్బారెడ్డి, కె.గురవయ్య, యక్కలూరి మారుతి, బొడపాటి కిషోర్‌, దూపాటి వంశీ, రమ్య, అంబేడ్కర్‌, వంగల వలివీరారెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు పూనూరి నాగేశ్వరరావు, నాయకులు సలీం, రబ్బాని పాల్గొన్నారు.

గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా మాట్లాడుతూ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మేయర్‌ కొవెలమూడి రవీంద్ర, జీఎంసీ కమిషనర్‌ శ్రీనివాసులు సిండికేట్‌గా మారి గ్రామాలను జీఎంసీలోకి విలీనం చేస్తూ తీర్మానం చేయడం ఏంటని అన్నారు. ఇప్పటికే నగరంలోని వార్డుల్లో తాగునీరు, పారిశుద్ధ్యం ఇతరత్రా మౌలిక సౌకర్యాల్లేవని మండిపడ్డారు. అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదన్నారు. కొత్తగా ప్రతిపాదనల్లేవని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన పనులనే అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్న వార్డుల్లో అభివృద్ధి జరగకపోతే కొత్తగా జీఎంసీలోకి విలీనమయ్యే గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారని ఆమె ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement