మరణంలోనూ వీడని బంధం
● రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృతి ● ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ప్రమాదం ● గుంటూరు నుంచి తిరుమలకు మొక్కు తీర్చుకునేందుకు వెళుతుండగా ఘటన
పెదకాకాని: 16వ నంబరు జాతీయ రహదారిపై ఒంగోలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన ఇద్దరు తల్లీకొడుకులు మృతిచెందారు. ఒంగోలు సమీపంలోని కొప్పోలు ఫ్లై ఓవర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. కొప్పురావూరు గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ తిరుమలశెట్టి కృష్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లావణ్యను అమరావతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బూసి వినయేంద్రకు ఇచ్చి వివాహం చేశాడు. వారి రెండేళ్ల బాబు లోక్షిత్‌కు పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు గుంటూరు నుంచి తిరుపతికి కారులో బయలు దేరారు. వినయేంద్ర కారులో వారికి సైతం మొక్కు ఉండడంతో గుంటూరులో ఉంటున్న ఆర్‌ఎంపీ కృష్ణ పెద్ద అన్నయ్య కుమారుడు తిరుమలశెట్టి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పావని(40), వారి చిన్నకుమారుడు చంద్రకౌశిక్(15)లు సైతం ఎక్కారు. వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం సుమారు 4:30 గంటల సమయంలో ఒంగోలు సమీపంలోని కొప్పోలు ఫ్లై ఓవర్ దాటిన తరువాత ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆగి ఉన్న లారీ వెనుక కారు ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఒక్కసారిగా కారును ఢీ కొంది. ఈ ఘటనలో కారు ముందు ఉన్న లారీకి ఢీ కొన్న కంటైనర్ మధ్య నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో తిరుమలశెట్టి పావని, ఆమె కుమారుడు చంద్రకౌశిక్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న బూసి లావణ్య, వినయేంద్రకు తీవ్రగాయాలు కాగా వారిలో వినయేంద్ర పరిస్థితి విషమంగా ఉంది. వారి కుమారుడు రెండేళ్ల లోక్షిత్, మేనమామ తిరుమలశెట్టి వెంకటేశ్వరరావులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
కొప్పురావూరులో విషాదం..
తిరుమలశెట్టి వెంకటేశ్వరరావు దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు వెంకట హర్షవర్ధన్ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. చిన్న కుమారుడు చంద్రకౌశిక్ గత నెలలో విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 576 మార్కులు సాధించాడు. దీంతో తలనీలాలు సమర్పించేందుకు తిరుమల బయలు దేరాడు. వారు ప్రయాణిస్తున్న కారును కంటైనర్ లారీ మృత్యువు రూపంలో వెంటాడింది. తల్లీకుమారులు మృత్యువాత పడడంతో కొప్పురావూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆర్‌ఎంపీ కృష్ణ చిన్న కుమార్తెకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. ఇంటి ముందు వేసిన పందిరి కూడా తీయలేదు. ఇంతలోనే ఊహించని విషాదంతో ఆ కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.
మరణంలోనూ వీడని బంధం


