జీజీహెచ్‌లో స్టెప్‌డౌన్ ఐసీయూ ప్రారంభం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో రూ.1.60 కోట్లతో నిర్మించిన స్టెప్ డౌన్ ఐసీయూను శనివారం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది నెలల కాలంలో గుంటూరు జీజీహెచ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. హెచ్‌డీఎస్ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త తులసి రామచంద్రప్రభు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చి నిలిచిపోయిన సర్వీస్ బ్లాక్ భవన నిర్మాణం చేపడుతున్నారన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ త్వరలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు ఆసుపత్రిలో ప్రారంభమవుతాయన్నారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ జీజీహెచ్‌లో రేకుల షెడ్డులో స్టెప్‌డౌన్ ఐసీయూ నిర్మాణంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మంచి ప్లేస్‌లో ఐసీయూ నిర్మాణం చేపట్టాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర యశశ్వి రమణ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సొసైటీ, ఏపీ స్టేట్ కమిటీ, భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్టు, భారత్ ఫార్మా అండ్ మెడికల్ ఆక్సిజన్స్ సహాయ సహకారాలతో స్టెప్‌డౌన్ ఐసీయూ ప్రారంభించామన్నారు. విరాళాలు అందజేసిన దాతలు భాష్యం రామకృష్ణ, రెడ్‌క్రాస్ కోశాధికారి రామచంద్రరాజు, భారత్ ఫార్మా అండ్ మెడికల్ ఆక్సిజన్ కంపెనీ ప్రతినిధులను ముఖ్య అతిథులు సన్మానించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, డెప్యూటీ మేయర్ షేక్ సజిలా, తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మేయర్ రవీంద్ర, ఎమ్మెల్సీల ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. మీడియా ప్రతినిధులు ఈవిషయాన్ని ప్రశ్నించి చిత్రీకరిస్తుండగా, ఆసుపత్రి సిబ్బంది హడావుడిగా సభా ప్రారంభానికి ముందు మంత్రి సత్యకుమార్ యాదవ్ చిత్రపటాన్ని ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు.
జీజీహెచ్‌లో స్టెప్‌డౌన్ ఐసీయూ ప్రారంభం


