గుంటూరు డీఆర్‌ఎంగా సుథేష్ఠ సేన్ బాధ్యతల స్వీకరణ
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు డీఆర్‌ఎంగా ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్‌ఏఎస్) సుధేష్ఠ సేన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తాజామాజీ డీఆర్‌ఎం ఎం.రామకృష్ణ సుథేష్ఠకు బాధ్యతలు అప్పగించారు. రామకృష్ణ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్‌కు ప్రిన్సిపల్ చీఫ్ సెఫ్టి ఆఫిసర్‌గా వెళ్లనున్న విషయం తెలిసిందే. సేన్ రైల్వేలో 1996 బ్యాచ్‌కు చెందిన వారు. ఆమె ఎకనామిక్స్‌లో ఆనర్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పబ్లిక్ పాలసీలో మాస్ట్‌ర్స్ డిగ్రీని పూర్తి చేశారు. తొలుత ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్‌కు ఎంపికై ముంబై సెంట్రల్ రైల్వేలో ఉద్యోగ బాధ్యతలు ప్రారంభించారు. అక్కడి నుంచి భోపాల్, జబల్పూర్, సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్‌కత్తాలోని వెస్ట్ సెంట్రల్ రైల్వేల్లో పని చేశారు. మంచి అధికారిగా గుర్తింపు పొందారు. ఆమె న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వేలో ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్‌ఏ అండ్ సీఏఓ)గా పని చేశారు. ఆమె డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, భారత ప్రభుత్వంలోని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఎన్‌సీఈఆర్‌టీగా డెప్యూటేషన్‌పై బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు రైల్వే డివిజన్‌ను సిబ్బంది సమన్వయంతో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. అనంతరం డివిజన్‌లోని పలు విభాగాధిపతులతో ఆమె మాట్లాడారు.
తల్లీబిడ్డకు ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలి
గుంటూరు లీగల్: ప్రతి బిడ్డా ఆరోగ్యంగా జన్మించాలని, ప్రసవ సమయంలో తల్లీబిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు సోమవారం గుంటూరు జీజీహెచ్‌లోని నర్సింగ్ విద్యార్థులకు, నర్సింగ్ సిబ్బంది, పిల్లల వైద్యశాఖ, ప్రసూతి వైద్య శాఖలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో జియావుద్దీన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తల్లులు, నవజాత శిశువుల మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. సదస్సులో డాక్టర్ అరుణ, డాక్టర్ దేవకుమార్, డాక్టర్ జయంతి, డాక్టర్ ఝాన్సీవాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు డీఆర్‌ఎంగా సుథేష్ఠ సేన్ బాధ్యతల స్వీకరణ


