
విశ్లేషణ
భారత్ ప్రగతి బాటలో పయనించేందుకు మహిళలకు సమస్థానం కల్పించడం అవసరం. లేకపోతే దేశం వెనుకబడి పోతుంది. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’కు చెందిన ‘2025 గ్లోబల్ జెండర్ గ్యాప్’ నివేదికలో అనాసక్తంగా కనిపించే గణాంక వివరాలను పరిశీలిస్తే తేలే వాస్తవం ఇది. ఇటీవల విడుదలైన ఈ నివేదికలో, మొత్తం 148 దేశాలలో భారత్ స్థానం 131గా ఉంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలకన్నా, పొరుగునున్న చాలా భాగం దక్షిణాసియా దేశాలకన్నా కూడా మనం దిగువన ఉన్నాం.
ఆనందం – దిగులు
ఆ నివేదికలో ఆనందింపజేసే, దిగులుపరచే అంశాలు రెండూ ఉన్నాయి. విద్యా, రాజకీయ రంగాల్లో మహిళల పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. భారత మహిళా రాజకీయ సాధికారత చైనాకన్నా ఎక్కు వగా, బ్రెజిల్‌కు దగ్గరగా ఉంది. బహుశా, పంచాయతీ రాజ్ సంస్థలలో స్త్రీలకు 33% ప్రాతినిధ్యం కల్పించడం దానికి తోడ్పడి ఉండ వచ్చు. పంచాయతీరాజ్ సంస్థలలో మహిళలు 45% మేరకు ఉన్నారు. కానీ, పార్లమెంట్ మొత్తం సభ్యుల్లో స్త్రీలు 14% మాత్రమే ఉన్నారు.
ఆర్థిక రంగంలో మహిళల భాగస్వామ్యం అంతంతమాత్రంగా ఉండటం వల్ల, ఈ విషయంలో ప్రపంచంలోని ఐదు అట్టడుగు దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. నిరుద్యోగం అధికంగా ఉన్న స్థితిలో, ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలను పురుషులే చేజిక్కించుకుంటున్నారు. మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యపు రేటు గత దశాబ్ద కాలంలో గణనీ యంగా తగ్గిందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి.)లో స్త్రీల వాటా 20% కన్నా తక్కువగా ఉంది.
ఇది కేవలం స్త్రీ–పురుష అసమానతా సమస్య కాదు. ఆర్థిక అభి లాషతో ముడిపడిన అంశం. ఉద్యోగాల్లో స్త్రీ–పురుషులకు సమత్వం కల్పిస్తే, 2025 నాటికి భారత్ జీడీపీకి 770 బిలియన్ల డాలర్లు జత కాగలవని మెకిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ అంచనా వేసింది. ప్రస్తుత రేటును పరిగణనలోకి తీసుకుంటే, అందుకు మరో 135 ఏళ్ళు పట్టవచ్చు. ఇది ప్రతి విధాన నిర్ణేతను ఆలోచింపజేయాలి. మహిళల భాగస్వామ్యాన్ని ఒక ప్రత్యేక హక్కుగా గుర్తిస్తూ, జాతీయ ప్రాధా న్యాలలో ఒక విప్లవాత్మక, సత్వర మార్పునకు వారు పురికొల్పాలి.
ప్రభుత్వాలదే ప్రాథమిక బాధ్యత!
మహిళలు సాధించగల అభివృద్ధి పైనే దేశ ప్రగతి ఆధారపడి ఉందని సాక్షాత్తు ప్రధాన మంత్రే పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే, ఆ ప్రాధాన్యతను గుర్తించడం తొలి అడుగు మాత్రమే. ఆర్థిక, రాజకీయ, సామాజిక జీవన రంగాల్లో మహిళలకు సమాన భాగ స్వామ్యం లభించేటట్లుగా విధానాలు రూపొందిస్తే సరిపోదు. అవి ఆచరణకు నోచుకునేట్లు అటు ప్రభుత్వాలూ, ఇటు ప్రైవేటు రంగమూ రెండూ గరిష్ఠ స్థాయిలో కృషి చేయాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ, రూపాంతరం చెందడాన్ని చూపించవలసిన ప్రాథ మిక బాధ్యత ప్రభుత్వాలదే.
ప్రస్తుతానికి, ఆ రకమైన నిబద్ధత సంశయాత్మకంగానే ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో, స్త్రీలను కూడా భాగస్వాములను చేసే గతి నిజంగానే వేగం పుంజుకుంది. కానీ, ఆ చేర్చుకోవడం ఇష్టపూర్వకంగా కాక, ఇక తప్పదన్నట్లుగా జరుగుతోంది.
ఈమధ్య ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికైన వారిలో స్త్రీలు 41%గా, ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో నియమితులైన వారిలో స్త్రీలు 38%గా ఉన్నారు. ఇది ఉత్సాహపరచే అంశమే. అయితే, ఆ రెండు సర్వీసుల్లోనూ మొత్తంమీద వారి ప్రాతినిధ్యం ఎంత మేర ఉన్నదీ స్పష్టం కాలేదు. సాయుధ దళాల్లో స్త్రీలు 3% కన్నా తక్కువగా ఉన్నారు. అన్ని రకాల పోలీసు దళాలలో స్త్రీలు 12% మేర ఉన్నారు. దీన్ని బట్టి రక్షణ, భద్రతా విభాగాలు ఇప్పటికీ మహిళలను అడుగు పెట్టనివ్చేవిగా లేవని అనిపిస్తోంది.
సుప్రీం కోర్టులో 2021లో అత్యధికంగా 33 మంది న్యాయ మూర్తులలో, నలుగురు మహిళలు ఉండేవారు. ఇపుడు మళ్ళీ ఒకే మహిళా న్యాయమూర్తి ఉన్న స్థితికి తిరిగొచ్చింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ చరిత్రలో ఒకే సమయంలో, ఒక సభ్యురాలిని మించి మరో మహిళ సభ్యురాలిగా ఉన్న సందర్భం ఇంతవరకు లేదు. ‘కనీసం ఒక మహిళా సభ్యురాలు’ ఉంటే చాలునని దాని నియమా వళే పేర్కొంటున్నప్పుడు ఇంకేం చేస్తాం!
33 శాతంతో సర్దుకుపోవాలా?
అయితే, మహిళలను కలుపుకొనిపోయేందుకు అనేక మార్గాలు న్నాయి. వాటిలో కొన్ని పనిచేయడం మొదలెట్టాయి. మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలు, మహిళలకు ఉద్దేశించిన పొదుపు పథకాలు, తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలు అందుబాటులోకి తేవడం వంటివి ఆర్థిక స్థితిగతులలో మార్పులు తేవడం ప్రారంభించాయి. కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు ప్రభుత్వాలు చేపట్టిన పథకాల వల్ల లక్షలాది మంది గ్రామీణ మహిళలు జీవనాధారం కోసం వేటిపైనో ఆధారపడటం నుంచి తామే పది మందికి ఉపాధి కల్పించగల సంస్థలను నడిపే స్థితికి చేరుకున్నారు.
జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజనను అలా ఉంచి, పార్లమెంట్, శాసన సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్న ఏనాటి డిమాండ్‌నో అమలులోకి తేవాల్సిన అవసరం ఉంది. అప్పుడే రాజకీయ రంగంలోకి మహిళలు పెద్ద సంఖ్యలో ఒక ఉప్పెనలా రావడాన్ని చూడగలుగుతాం. బ్రిటన్‌లో మొత్తం మహిళలే ఉండేట్లుగా కుదించిన జాబితాలను రూపొందించాలని లేబర్ పార్టీ పట్టుబట్టడం వల్ల 10% కన్నా తక్కువగా ఉండే మహిళా ప్రాతినిధ్యం ఇరవై ఏళ్ళలో 30%కి పైగా పెరిగింది.
వ్యవస్థలే సమాజాల రూపు రేఖల్ని నిర్ణయించి, వాటి విలువలను, పక్షపాతాలను ముందుకు తీసుకెళతాయి. మంకుపట్టు పితృస్వామ్య సంస్కృతులు, వారసత్వంగా వచ్చిన విధానాలు మహి ళలు భాగస్వాములు కాకుండా అడ్డుపడతాయి. పురుషాధిపత్య పర్యా వరణాలు తటస్థంగా, నిష్పక్షపాతంగా, ప్రతిభకు పట్టం కట్టేవిగా ఉంటాయని సంస్థలు తరచు భావిస్తుంటాయి. మహిళలు తమ సామాజిక, శారీరక వాస్తవికతలను లెక్కలోకి తీసుకోవాలని కోరడాన్ని, వారు విలాసాలను కోరుకుంటున్నట్లుగా చిత్రించడం పరిపాటి.
అగ్ర స్థానాలకు కొద్ది మంది స్త్రీలే చేరుకోగలగడానికి గల కారణాల్లో, స్త్రీ–పురుషుల యోగ్యతల్లో ఉన్న తేడాని గుర్తించడానికి విముఖత చూపడం కూడా ఒకటి. సబార్డినేట్ కోర్టు జడ్డీలలో స్త్రీలు 38% మేర ఉంటే, హైకోర్టులలో కేవలం 14% మంది మాత్రమే ఉన్నారు. పోలీసు శాఖలో అధికారుల స్థాయిలో 8% మాత్రమే ఉన్నారు. ప్రైవేటు రంగంలో మాత్రం మహిళలు గౌరవప్రదమైన శాతంలోనే మధ్య స్థాయి మేనేజ్ మెంట్‌లో పదవులు నిర్వహి స్తున్నారు. కానీ, భారతదేశపు ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో మహిళల నాయకత్వాన నడుస్తున్నవి 2% పైచిలుకు మాత్రమే!
సమత్వం సమానత్వానికి, సమతూకానికి సంబంధించినది. ఏ రంగంలోనైనా సరే, స్త్రీ–పురుషులలో ఏ ఒక్కరూ 50–60% మించకుండా ఉన్నప్పుడే సమత్వం సాధ్యమవుతుంది. కానీ, సమాన స్థానాన్ని, స్థాయిని కోరుకోవడాన్ని అసమంజసమైనదిగా చిత్రిస్తూ, జాతీయ తర్జన భర్జనలు స్త్రీలను 33%కి పరిమితం చేసేశాయి.
స్త్రీలు 33%తోనే సంతోషపడితే, ఒక అసంతృప్తితోనే దాన్ని అంగీకరించినట్లవుతుంది. అసమంజసమైన కోటాకే సర్దుకుపోయినట్లు అవుతుంది. మహిళలను భాగస్థులను చేయడానికి అన్ని సంస్థలు సత్వరం, ఇష్టపూర్వకంగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. ఏనాటి నుంచో కాలరాచిన హక్కుకు పరిహారం చెల్లిస్తున్నట్లుగా ఆ పని సాగాలి.
మాజా దారూవాలా
వ్యాసకర్త ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్’కు చీఫ్ ఎడిటర్
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)