
ఆంధ్రదేశం నదులతో, కొండలతో, సముద్ర తీరంతో సుసంపన్నమైనది. గోదా వరి, కృష్ణ, పెన్నా వంటి నదులు, ఉప నదు లతో ఒకనాడు సస్యశ్యామలంగా వర్ధిల్లింది. ఆంధ్రదేశ భౌగోళిక, సాంస్కృతిక, తాత్విక సాంకేతిక సంపద ప్రసిద్ధమైనది. చరిత్రకా రుల ప్రకారం మొత్తం భారతదేశంలోనే ఇన్ని భౌగోళిక వనరులున్న ప్రాంతం మరొకటి లేదు. 974 కిలోమీటర్ల సముద్ర తీరం దీనికి ఆయువు. నదులు, చెరువులు, కాలువలు, గడ్డి మైదానాలతో; పండ్ల, ఫల, వృక్షాలతో ఆంధ్రదేశం సుసంపన్నమైనది. అంతేకాదు, దక్షిణాపథంలో ఆంధ్రదేశం కీలక స్థానంలో ఉంది. దానికితోడు తూర్పు తీరమైదానం సారవంతమైన పంట భూమి. అచటి రేవు పట్టణాలు దూరదేశాలతో వాణిజ్యం సాగించి ఐశ్వర్యవంతమైనాయి. కాకతీయులు విజృంభించే వరకు తీరాంధ్రమే ఆంధ్రదేశ రాజకీయా ధికారానికి కేంద్రమై, సాంస్కృతిక ఉద్యమాలకు పుట్టినిల్లయింది.
దక్షిణాపథంలో పశ్చిమ ప్రాంతంలో విజృంభించిన రాజవంశాలు తీరాంధ్రాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాయి. ఆంధ్రదేశాన్ని ఆక్రమించినవారు సులభంగా దక్షిణాపథ ఆధిపత్యం సాధించగలరు. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్రా నదుల అంతర్వేదిపై ప్రతి రాజవంశం దృష్టి ఉండేది. అందుకే దాన్ని వశపరచుకోడానికై పల్లవులు, చాళు క్యులు, రాష్ట్రకూటులు, చోళులు, కల్యాణి చాళుక్యులు, విజయనగర రాజులు, బహుమనీ సుల్తానుల సంఘర్షణలు యావద్భారత చరిత్ర లోనే ఆసక్తిదాయకమైనవి. తత్ఫలితంగా ఈ రాజ వంశాలకు యుద్ధ రంగమై ఆంధ్రదేశం అశాంతికి, బాధలకు గురైంది. ఈదండ యాత్రల ద్వారా ద్రావిడులు, కన్నడిగులు, మరాఠీలు (కాయస్థులు), కాళింగులు అధిక సంఖ్యలో ఆంధ్ర దేశానికి వచ్చి నిలిచిపోయినారు. అందుచేతనే భారతజాతిలో వలెనే ఆంధ్రజాతిలో భౌతికమైన వైవిధ్యం కనిపిస్తుంది.
ఒకప్పుడు వర్ధిల్లిన ప్రాంతం
భారతదేశాన్ని పాలించిన శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, ముఖ్యంగా కృష్ణదేవరాయలు మన వ్యవ సాయ సంస్కృతిని విస్తృతపరిచారు. అంతేగాకుండా మన సంపద బంగారు, వెండి, రాగి ధనాగారాలతో ఎలా వర్ధిల్లిందో చూడండి: విజయనగరంలో బంగారు, వెండి, రాగి నాణేలు అమలులో ఉండేవి. గద్యాణం బంగారు నాణెం. దాన్నే ‘వరాహ’ అనేవారు. ఇది చాళు క్యుల కాలం నుండి వస్తున్న నాణెం. బహుశా వరాహ పదమే ‘వరహా’ అయివుంటుంది.
కృష్ణరాయల గద్యాణం 119.7 వడ్ల గింజల ఎత్తు ఉండేది. ఘట్టి వరాహ, దొడ్డ వరాహ అనే ప్రత్యేక గద్యా ణాలు కూడ ఇచ్చేవారు. గద్యాణంలో సగం ‘ప్రతాప’. తరువాతవి ‘పణం’, ‘చిన్నం’. ఇవి అన్నీ బంగారు నాణేలే. ఎక్కువ వాడుకలో ఉన్న నాణెం పణం. ‘తార్’ అనేది వెండి నాణెం. ఇది పణంలో ఆరో వంతు. జిటలు, కాసు అనేవి రాగి నాణాలు. ఇవిగాక రాజ్యం పశ్చిమ ప్రాంతాల్లో పోర్చుగీస్, ఈజిప్షియన్ నాణేలు వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనారం ఈజిప్షియన్ నాణెం. ప్రౌఢరాయలు ‘దీనార టంకాల’తో శ్రీనాథుని తీర్థమాడించినాడు.
ప్రభుత్వమేగాక రాష్ట్రపాలకులు నగరాధిపతులు (వర్తక శ్రేష్ఠులు) గూడా నాణేలు ముద్రించేవారు. ‘ప్రతి సంస్థానానికీ టంక శాల గుత్త చేసుకొని వారి వారి పేరటను ముద్రలు కల్పించుతూ వచ్చిరి’ అని అట్టవన తంత్రం చెబుతున్నది. నాణేల నాణ్యతను కంసాలులు ఒరపు రాతినుపయోగించి నిర్ణయించేవారు.
గ్రామాల్లో దుర్భర పరిస్థితులు
ఇకపోతే ఇప్పుడున్న ఆంధ్రదేశ పరిస్థితి చరిత్రతో పోల్చుకుని చూస్తే దారుణంగా ఉంది. ముఖ్యంగా గ్రామాలు త్రాగునీరు లేక, సాగునీరు అందక, చివరకు పశుగ్రాసం కూడా అందక విలవిల్లాడు తున్నాయి. ఆంధ్రదేశంలో జీవించే పరిస్థితులు లేక దళితులు, బడుగు వర్గాలు విలవిలలాడుతున్నాయి. ఈ పరిస్థితి కరవును తలపిస్తూ ఉంది. కరవు రాష్ట్రజీవన వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రధా నంగా గ్రామాల్లో వృద్ధులు అన్నం లేక, గంజి లేక, సూరుల క్రింద ఉసూరుమంటూ జీవిస్తున్నారు. సామాజిక కార్యకర్తలుగా గ్రామాలకు వెళితే గుండెలు తరుక్కు పోయే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మూడుతాళ్ళ పాడులో దళిత స్త్రీలను ప్రశ్నిస్తే, ‘అన్నం వండుకొని మూడు రోజు లైంది’ అని చెప్పారు.
ఒకవేళ అన్నం వండుకున్నా చింతపండు పచ్చడి తప్ప కూర వండుకోలేని దశలో ఉన్నామనీ, ఇటువంటి దయ నీయమైన పరిస్థితి మా జీవిత కాలంలో ఎప్పుడూ చూడలేదనీ వారు అన్నారు. అంటే ఒక కూర వండుకునే పరిస్థితిలో కూడా ఇవ్వాళ్టి గ్రామాలు లేవు. ఈ పరిస్థితుల్లో కూడా భర్తలకు ఏదైనా పని దొరికితే వారు తాగే వస్తున్నారని చెప్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా రోడ్డులోని గోవిందాపురం మాదిగవాడలో కొందరు స్త్రీలతో మాట్లాడితే, కనీసం పని దొరికి వారం రోజులైందనీ, దొరికినా వచ్చే తక్కువ కూలీకి బియ్యం, ఇతర వస్తువులు రాక పస్తులుంటున్నామనీ, తలకు నూనె కూడా పెట్టుకోక నెలలు అయ్యిందనీ, పిల్లలను బడికి పంపలేక పనికి తీసుకెళుతున్నామనీ చెప్పారు.
నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలో కూలీ లేక ఊళ్ళకు ఊళ్ళు తరలి వెళ్ళిపోతున్నాయి. వ్యవసాయ కూలీలే కాదు, చేనేత కార్మికులైతే దుర్భర దారిద్య్రంలో ఉన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట దేవాంగులు, పద్మశాలీలు... ఒక్కొక్క ఇంట్లో నాలుగైదు కుటుంబాలు జీవిస్తున్నామనీ, సరైన మజూరు లేక, ఇండ్లస్థలాలు లేక ఎమ్మార్వో చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయామనీ అంటున్నారు. ముఖ్యమంత్రి గారు చేనేతవారికి ప్రకటించిన లోన్లు అడిగితే... ‘ప్రకటనలు అలాగే ఉంటాయి, మాకు ఏమీ ఆర్డర్స్ రాలే’దని చెపుతున్నా రనీ, ఇటువంటి ఆర్థిక దుఃస్థితి మేము గత 30 ఏళ్ళుగా ఎప్పుడూ చూడలేదనీ అంటు న్నారు. విజయవాడలో ఒక బ్రాహ్మణ వీధిలో ఉంటున్న 200 కుటుంబాల్లో కనీసం 50 కుటుంబాలైనా పస్తులు ఉంటా యనీ, పట్టణాలలో పనిలేదనీ, ఇండ్ల స్థలాలు లేవనీ చెప్పారు.
పోరాటమే మార్గం!
ఆకలికి కులం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కరవు వలన నిరాసక్తత, నిర్వీర్యత అలుముకొని ఉన్నాయి. అటు పొలం పనులైన నాట్లు, కోతలు, కలుపులు లేవు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పనిచేసు కోవాలంటే, బిల్డింగ్ కట్టే పనులే కాని వ్యవసాయ కూలీ పనులు లేవు. ఆంధ్ర దేశానికి గుండెకాయగా చెబుతున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపల చెరువులు, రొయ్యల చెరువుల వలన వ్యవసాయ పనులు పూర్తిగా మృగ్యమయ్యాయి. పశువుల పరిస్థితి దారుణంగా ఉంది. పశువుల దాహార్తి, పశుగ్రాస లేమి సామాజిక, ఆర్థికవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏటా వేసవి సీజన్లో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉన్నా అధికారులు సకాలంలో స్పందించ లేదు. వేసవిలో పశుగ్రాసం కొరత, వాతావరణ పరిస్థితుల కారణంగా పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఎండు గడ్డి, పచ్చగడ్డి సమ పరిమాణంలో అందించడంతోపాటు వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణకు సరైన చర్యలు తీసుకోవాలి.
ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో భూమి ఎందుకు పంచటం లేదనేది, కార్పొరేట్ వ్యవస్థలకే భూమి ఎందుకు చవక రేట్లకు ఇస్తున్నారనేది నగ్న సత్యం. ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి కూలీలు మండుటెండల్లో ఎండుతున్నా వారికి మంచినీళ్ళు లేవు. వారికి కూలీ నెలలు తరబడి ఆపుతున్నారు. వారు దిక్కులేని పక్షుల్లా బతుకుతున్నారు. నిరాశా నిస్పృహలతో ప్రజలు జీవిస్తున్నారు. ఇది మంచిది కాదు. పాలక వర్గాలు రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచించాలి. దేశానికి ఆయువైన గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నిండాలి. రైతులు, రైతు కూలీలు, వృత్తిదారుల ముఖాలలో నవ్వు వికసించాలి. అందుకు పోరాటాలే మార్గం. ప్రజలు చైతన్యవంతులై అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి. దళిత బహుజనులు తమ రాజ్యాంగ హక్కుల కోసం పోరాడినప్పుడే నిజమైన విముక్తి కలుగుతుంది.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695