నిబంధనల అమలులోనే అసలు చిక్కు! | Sakshi
Sakshi News home page

నిబంధనల అమలులోనే అసలు చిక్కు!

Published Wed, May 22 2024 5:31 AM

Sakshi Guest Column On Food Products Contaminants in Spices

సందర్భం

భారతీయ మసాలాలపై హాంకాంగ్‌  ఈమధ్యే నిషేధం విధించింది. మూడు బ్రాండ్లపై ఈ నిషేధం వేటు పడింది. సింగపూర్‌లోనూ ఇంకో భారతీయ మసాలా కంపెనీపై ఇలాంటి క్రమశిక్షణ చర్యలే తీసుకున్నారు. ఎథిలీన్‌ ఆక్సైడ్‌ అనే కేన్సర్‌ కారక రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో ఆయా దేశాల నియంత్రణ సంస్థలు ఈ చర్యలకు పాల్పడ్డాయి. మాల్దీవులు చర్యలకు సిద్ధమవుతూండగా... అమెరికా, ఆస్ట్రేలియా ఆహార నియంత్రణ సంస్థలు కూడా మసాలాల్లో కలుషితాలపై నివేదికలను అధ్యయనం చేసే పనిలో ఉన్నాయి. 

నిజానికి ఇలాంటి చర్యలు భారతీయ కంపెనీలకు కొత్తేమీ కాదు. అమెరికా చేరుతున్న భారతీయ ఉత్పత్తుల్లో ఏటా కొన్ని వందలు నాణ్యత ప్రమాణాల లేమి కారణంగా తిరస్కరణకు గురవుతూనే ఉంటాయి. ఆయుర్వేద మందులపై కూడా ఎఫ్‌డీఏ తరచూ హెచ్చరికలు జారీ చేస్తూంటుంది. సీసం వంటి ప్రమాదకర భారలోహాలు, పదార్థాలు పరిమితికి మించి ఉంటాయన్నది వీరు తరచూ వ్యక్తం చేసే అభ్యంతరం. చిన్న పిల్లల ఆహారం విషయంలో ఇటీవలే అంతర్జాతీయ కంపెనీ నెస్లే భారత్‌లో మాత్రమే అధిక చక్కెరలు వాడుతున్న విషయం బయటపడ్డ సంగతి తెలిసిందే. 

ఇలాంటి ఘటనలు అన్నింటిలోనూ ఒక నిర్దిష్ట క్రమం కనిపిస్తుంది. కంపెనీ భారత్‌ది అయినా, విదేశీయులది అయినా సరే మా తప్పేమీ లేదని ప్రకటిస్తాయి. తయారు చేసిన దేశం లేదా ఎగుమతి చేస్తున్న దేశం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నామని కూడా చెబుతాయి.  భారతీయ నియంత్రణ సంస్థలు ఇచ్చే సమాధానం కూడా పద్ధతిగా ఉంటుంది. ‘పరిస్థితిని అధ్యయనం చేస్తున్నాం’ అనేసి చేతులు దులిపేసుకుంటాయి. విదేశీ సంస్థలు సమచారం పంచుకోలేదన్న ఆరోపణ కూడా ఉంటుంది. 

ఎగుమతి ప్రోత్సాహక వ్యవస్థలు, కంపెనీలు రెండూ తాము బాధితులమని వాదిస్తూంటాయి. భారతీయ ఎగుమతులను మాత్రమే పాశ్చాత్య దేశాలు అడ్డుకుంటున్నాయని వాపోతాయి కూడా. ఈ మొత్తం వ్యవహారంలో నిస్సహాయంగా మిగిలిపోయేదెవరూ అంటే... వినియోగదారుడు మాత్రమే. కొంచెం సద్దుమణిగిన తరువాత అంతా షరా మామూలుగానే నడిచిపోతూంటుంది. 

కల్తీ, హానికారక, కాలుష్యాలతో కూడి ఆహార పదార్థాలు విదేశాలను చేరుతున్న విషయంలో అసలు సమస్య ఏమిటన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆహార నియంత్రణ వ్యవస్థ నిబంధనల్లోని లోటుపాట్లు సరి చేసే ప్రయత్నం జరగడం లేదు.   

ఇంకో ముఖ్యమైన విషయం పరిశ్రమలను, ఎగుమతులను కాపాడుకోవాలనే నెపంతో ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు. తప్పు చేసినా వాటి ప్రభావం నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం. ఈ క్రమంలోనే వీళ్లు ప్రజారోగ్యాన్నీ; వినియోగదారులు, పౌర సమాజ నిపుణుల అభిప్రాయాలనూ తోసిపుచ్చుతూంటారు. 

వివాదాల్లో చిక్కుకున్న కంపెనీలు భారత్‌లోని ఫుడ్‌సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)’ నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నట్లు చెప్పుకుని ఎలాగోలా తప్పించుకుంటాయి. నెస్లే విషయంలో ఈమధ్య జరిగింది ఇదే. కాబట్టి... ఆహార రంగంలో ఎగుమతులకు సంబంధించి ప్రమాణాలను స్పష్టంగా నిర్వచించడం చాలా అవసరం. 

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలో ఆహార ఉత్పత్తుల (పానీయాల నుంచి సముద్ర ఉత్పత్తుల వరకూ) ప్రమాణాలపై సమాచారం ఇచ్చేందుకు, నిర్దేశించేందుకు 26 శాస్త్రీయ కమిటీలు ఉన్నాయి. 2008లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఏర్పాటు జరిగినప్పుడు ఏర్పాటైన ఈ ప్యానెల్స్‌లో భారతీయ, విదేశీ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో వీటి పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటికీ ఆహార కంపెనీల ప్రతినిధుల పెత్తనమే ఇప్పటికీ కొనసాగుతోంది. 

కొన్నేళ్ల తరువాత ఇది కూడా మారింది. ప్రస్తుతం ఈ ప్యానెళ్లలో ఎక్కువగా శాస్త్రవేత్తలు, రిటైర్‌ అయిన వాళ్లు ఉంటున్నారు. అయినప్పటికీ నిబంధనల రూపకల్పనలో పరిశ్రమల ప్రభావం లేదని కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతమున్న ప్యానెళ్ల కూర్పును మచ్చుకు తరచి చూస్తే చాలామందికి ఇప్పుడు, లేదంటే గతంలో... పరిశ్రమలతో ఏదో ఒక లింకు కచ్చితంగా కనిపిస్తుంది. 

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ముందు ఈ ప్యానెళ్ల సభ్యుల పూర్వాపరాలను కచ్చితంగా బహిరంగపరచాలి. దీనివల్ల వినియోగదారుడికి తాను తినే ఆహారానికి సంబంధించి ఎవరు రూల్స్‌ తయారు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే సీఐఐ, హిందుస్థాన్‌ లీవర్‌ వంటి సంస్థలతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ భాగస్వామ్యం వంటి ఏర్పాటు పలు సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని గుర్తించాలి. నిష్పాక్షిక, పారదర్శక సంస్థగా ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేయడం అవసరం, మేలు కూడా. 

చాలా ఏళ్లు వినియోగదారు సమూహాలు, ఆరోగ్య నిపుణులు ఉప్పు, చక్కెర, కొవ్వులు అధికంగా ఉన్న ఆహార పదార్థాలపై ప్రత్యేకమైన లేబుల్‌ ఒకటి వేయాలని కోరుతున్నాయి. అయితే ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ, పరిశ్రమ వర్గాలు రెండూ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇంకోవైపు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరిశ్రమలు చేసే డిమాండ్లను నెరవేర్చడంలో చాలా చురుకుగానే ఉంటోంది. విటమిన్లు ఇతర పోషకాలను చేర్చిన ఆహారానికి ప్రత్యేకమైన లేబుల్‌ ఉండాలన్న పరిశ్రమ డిమాండ్‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆగమేఘాలపై ఒప్పేసుకోవడం ఒక ఉదాహరణ.

ఆహార పదార్థాల విషయంలో నియంత్రణ అధ్వాన్నంగా ఉంటే... పరిశ్రమ వర్గాల నిబంధనల పాలన కూడా అంతే తక్కువ అని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) స్వయంగా గుర్తించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. కాగ్‌ 2017 లోనే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలను నిర్దేశించేందుకు సమయ బద్ధమైన ప్రణాళిక ఏదీ పాటించడం లేదని విమర్శించింది. అసంపూర్తిగా ఉన్న సమాచారం ఆధారంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది, ఆహార పదార్థాలను పరిశీలించే ల్యాబొరేటరీలు 72లో 56 ల్యాబ్స్‌కు తగిన అక్రిడిషన్‌ సర్టిఫికెట్లు కూడా లేనవి ఎత్తి చూపింది.  

పార్లమెంటరీ కమిటీ ఒకటి కూడా ఆహార పదార్థాలకు సంబంధించిన నియమ నిబంధనల రూపకల్పన విషయంలో మరింత పారదర్శకత తీసుకు రావాల్సిన అవసరాన్ని తన నివేదిక రూపంలో స్పష్టం చేసిన విషయం గమనార్హం. ఆహార పదార్థాల విషయంలో కొంత జాగరూకతతో వ్యవహరించాలన్నది ఇప్పటికైనా గుర్తిస్తే అది ప్రజారోగ్యానికి మంచి చేయగలదని అర్థం చేసుకోవాలి. 

దినేశ్‌ సి. శర్మ 
వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత 
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Advertisement
 
Advertisement
 
Advertisement