ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు! | Sakshi Guest Column On Electoral Bonds of Political Parties | Sakshi
Sakshi News home page

ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు!

Published Mon, Mar 18 2024 1:11 AM | Last Updated on Mon, Mar 18 2024 1:11 AM

Sakshi Guest Column On Electoral Bonds of Political Parties

కామెంట్‌

రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించటానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. ఆ సందర్భంలోనే – భారతీయ స్టేట్‌ బ్యాంకు ఇంతవరకు తాను కోనుగోలు చేసిన బాండ్ల వివరాలను నిర్ణీత గడువులోపు ఎన్నికల సంఘానికి వెల్లడించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించడంతో బ్యాంకు పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం, కోర్టు ఆదేశాల ప్రకారం బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. దాంతో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ కొంతమేరకైనా వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. అయితే, ప్రశ్నేమిటంటే... ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బ్యాంకు చేత ఇంతకాలంగా వివరాలు వెల్లడించనివ్వకుండా చేయిస్తున్నది ఎవరు అని! అయితే ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు!

నా తొలి బ్యాంకు ఖాతా ఢిల్లీ పార్లమెంట్‌ స్ట్రీట్‌లోని భారతీయ స్టేట్‌ బ్యాంకు శాఖలో ఉండేది. నా పేరిట నాన్న దానిని తెరిచినప్పుడు నా వయసు 16 ఏళ్లు. మా పూర్వీకుల భూములను విక్రయించటం ద్వారా నా వాటాగా వచ్చిన మొత్తాన్ని జమ చేసేందుకు ఉద్దేశించిన ఖాతా అది. ఆ ఖాతాను ప్రతి నెలా వడ్డీ వచ్చేలా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు జత కలిపారు. ఆ వడ్డీ పెద్ద మొత్తమేమీ కాదు కానీ, నేనొక డబ్బు గల ఆసామినన్న భావన నాలో కలిగించింది.

నాన్న సొంత ఖాతా గ్రిండ్లేస్‌ బ్యాంకులో ఉండేది. ఆ బ్యాంకు ఇప్పుడు ఉనికిలో లేదు. నాన్న నా కోసం ఆ రోజు ఎస్‌.బి.ఐ. బ్యాంకును ఎందుకు ఎంచుకున్నారో నాకు గుర్తులేదు కానీ, ఆ సంస్థ పట్ల ఆయన ఉన్నతమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారని అనుకుంటాను.  

డెబ్బయ్‌లలో బ్యాంకింగ్‌ చాలా భిన్నంగా ఉండేది. నగదు లావాదేవీల టెల్లర్‌ కౌంటర్‌ల వద్ద పొడవైన క్యూలు ఉండేవి. సొంత చెక్కులకు డబ్బు ఇవ్వడానికి కూడా వారి ఖాతాలను తనిఖీ చేసేవారు. అదంతా కూడా అమిత ప్రయాసతో కూడిన దుర్భరమైన తతంగంలా ఉండేది. ఆ దశలో అకస్మాత్తుగా ఎస్‌.బి.ఐ. మన ఖాతాలో సరిపడా నిధులు ఉన్నాయా, లేవా అన్నది కూడా నిర్ధారణ చేసుకోకుండానే సెల్ఫ్‌–చెక్కులను ఒక నిర్ణీత పరిమితి వరకు నగదుగా మార్చుకునే అవకాశం కల్పించిన మొదటి బ్యాంకుగా అవతరించింది. ఆ దెబ్బతో, అరగంట పట్టే పని... నిమిషాల్లో అయిపోవడం మొదలైంది. 

ఆఖరికి నాగర్‌వాలా నగదు కుంభకోణం కూడా ఎస్‌.బి.ఐ. దేదీప్యాన్ని చెక్కుచెదర్చలేక పోయింది. ఎగతాళిగా నవ్వినవారు లేకపోలేదు కానీ, బ్యాంకు నుంచి తమ ఖాతాలను ఉపసంహరించుకున్న వారు చాలా తక్కువ. అలాంటి కుంభకోణాలు ఊహించినవే. అయినా అవి నేరారోపణలు వచ్చేంతగా పరిగణన పొందనివి.

ఆ రోజుల్లో మా అమ్మ 50 పైసలు, 1 రూపాయి నాణేలను పొదుపు చేసేవారు. ఒక పాత టప్పర్‌వేర్‌ బ్రెడ్‌ బాక్సులో వాటిని ఆమె భద్రంగా దాస్తూ ఉండేవారు. అలా కూడబెట్టిన ఆ అపురూపమైన నాణేలను ఎస్‌.బి.ఐ.కి తీసుకెళ్లి ఆమె ఖాతాలో జమ చేసి రావడం అనే బాధ్యత నాపై పడుతుండేది. కౌంటర్‌లో ఉండే టెల్లర్‌ ఆ నాణేలను తూకం వేసి చూసి, మా అమ్మలోని ఇలా పోగేసే గృహిణి నైజాన్ని ప్రశంసించేవారు. ‘‘మేరీ బీవీ భీ యహీ కర్తీ హై’’ (మా ఇంటావిడ కూడా ఇలాగే చేస్తుంటుంది) అనే అతడి మాట నాలోని టీనేజ్‌ బిడియాన్ని పోగొట్టేది. ఆయన అలా అనేవరకు కూడా నన్ను నేను మురికి నాణేలను సంచిలో మూట కట్టుకుని బ్యాంకుకు వెళ్లే వ్యాపారిలానే భావించుకున్నాను. 

స్టో లేదా కేంబ్రిడ్జి నుండి సెలవులకు వచ్చినప్పుడు పార్లమెంటు స్ట్రీట్‌ బ్రాంచి నిరంతరం నాకు పని కల్పించేది. నాకు మాత్రమే కాదు, ఇంట్లో అందరికి! ఎందుకు అని నన్నడక్కండి. అనుకోకుండా ఎందుకో వెళ్లేవాళ్లం. వెళ్లిన ప్రతిసారీ ఇలా వెళ్లి అలా వచ్చేయటం అన్నట్లుగా ఉండకపోయే వాళ్లం. కనుక, ఆ ప్రదేశంపై నాకు మక్కువ ఏర్పడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

తరచుగా ఏం జరిగేదంటే, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నా పని పూర్తి అయినప్పుడు పై అంతస్థులకు కూడా వెళ్లి, నా చిన్న మొత్తాల పొదుపుపై సలహాలు అడుగుతుండేవాడిని. 20 ఏళ్ల యువకుడిలోని ఆ అతిక్రమణను ఐదవ అంతస్థులోని మేనేజర్లు గొప్ప సంసిద్ధతతో క్షమించేసేవారు. నా ప్రశ్నల్ని వారు స్వాగతించారని కూడా నాకు గట్టిగా అనిపించేది. 

ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నాకు తెలిసిన బ్యాంకు ఎప్పుడూ కూడా గత వారం ఎస్‌.బి.ఐ. వ్యవహరించిన విధంగా అయితే లేదు. సుప్రీంకోర్టు మందలింపుతో బహుశా ఆ బ్యాంకు సిబ్బంది ముడుచుకుపోయి ఉండొచ్చు. మనకున్న అత్యుత్తమ సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఒకరైన మదన్‌ లోకూర్, ‘‘బ్యాంకుకు ఇది చెంపపెట్టు’’ అని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తిగా ఆయన పని చేసిన ఇన్నేళ్లలోనూ ఇలా ఒక బ్యాంకు మందలింపునకు గురైన సంఘటనను ఆయన గుర్తు చేసుకోలేదు. 

గత సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి అడిగిన ఒక ప్రశ్న ఎస్‌.బి.ఐ.ని నెలల తరబడి, కాదంటే ఏళ్ల తరబడి వేధిస్తుందా అని నా ఆందోళన. ‘‘ఆదేశాలను పాటించటం మీకు కష్టంగా ఉందని మీరు చెబుతున్నారా?’’ అని ఆయన అడిగారు. ‘‘గత 26 రోజులలో మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఆ విషయంలో మీరు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎస్‌.బి.ఐ. నుంచి ఒక స్థాయి నిజాయితీని మేము ఆశిస్తున్నాం’’ అన్నారు. 

నా బ్యాంకు ఇంతగా తక్కువ కావటం – ఇప్పటికీ అది నా బ్యాంకులలో ఒకటి కావటం – నాకు బాధను కలిగిస్తోంది. ఎందుకు అలా అనిపిస్తోందని అడక్కండి. బహుశా ఇది అర్ధ శతాబ్దం పాటు సాగిన బాంధవ్య పరిణామం కావచ్చు. లేదా, నాకు అలా అనిపిస్తుండొచ్చు. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇది తప్ప వేరొక వివరణ నాకు తోచటం లేదు. 

అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే – సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఎస్‌.బి.ఐ. ఉద్దేశపూర్వకంగా తనకు అవసరమైన రీతిలో తప్పుగా అన్వయించుకోవటం ద్వారా, కోర్టు ఆదేశించిన ఒక సాధారణమైన పనిని కావాలనే క్లిష్టతరం చేసి, ఆ ఆదేశాన్ని పాటించలేకపోవటానికి తిరిగి ఆ సంక్లిష్టతనే ఒక నెపంగా చూపిందా అన్న అనుమానానికి ఆస్కారం కలగడం. ఒక గౌరవప్రదమైన బ్యాంకు నుంచి మీరు ఇలాంటిది ఊహించలేరు. దీర్ఘకాలంగా మీరు అనుబంధం కలిగి ఉన్న ఒక బ్యాంకు విషయంలో ఇలా జరిగినప్పుడు భ్రమలు తొలిగినట్లుగా అనిపిస్తుంది. 

ప్రభుత్వమే వెనుక ఉండి ఇలా జరిపించిందా? ఇదేమీ తేలికైన ప్రశ్న కాదు. అయినప్పటికీ మీలోని లక్షల మందికి, ఆ లక్షల్లో ఎక్కువ మందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు. కానీ ఈ ప్రశ్న అడగటం వెనుక ఉన్న వాస్తవం బాధను కలిగిస్తుంది. ఆ బాధ అందరికంటే ఎక్కువగా ఆ బ్యాంకు ఉన్నతాధికారులలో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. 

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement